వేకనూరులో వైభవంగా సామూహిక కుంకుమ పూజ
అవనిగడ్డ, మేజర్ న్యూస్: వేకనూరులోని మాదివాడ కోదండ రామాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన ధార్మిక కార్యక్రమాలు శనివారం సామూహిక కుంకుమ పూజతో ముగిశాయి.
జిల్లా కోఆర్డినేటర్ సీవీకే ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా సింహాద్రి పద్మ రామాయణం, మహాభారతం, భగవద్గీతపై ప్రవచనాలు చేశారు. చివరి రోజు సీవీకే ప్రసాద్ వేదమంత్రోచ్చారణల నడుమ పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు సామూహిక కుంకుమ పూజలో పాల్గొన్నారు.
అనంతరం సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, స్వామివారిని విశేషంగా అలంకరించారు. భక్తులు దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ కమిటీ పర్యవేక్షించింది.
✍️అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా