కేసీఆర్ దీక్ష.. తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం!
పటాన్‌చెరు;తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. "తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో" అనే నినాదంతో ప్రారంభమైన ఆ దీక్ష యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలించిందని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కొత్త ఊపిరి పోసిందని గుర్తుచేశారు.నవంబర్ 29 దీక్షా దివస్‌ను పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సఫాన్ దేవ్, పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను, సాగించిన పోరాటాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను శాలువాలతో సత్కరించి గౌరవించారు.
ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో చారిత్రాత్మక మలుపుగా నిలిచిందన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను ఉద్యమ రూపంలోకి తీసుకొచ్చి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు బలమైన పునాది వేసిందని పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల త్యాగాలు, ప్రజల భాగస్వామ్యం ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. అమరవీరుల త్యాగాలను, ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, యాదగిరి యాదవ్, పృథ్వీరాజ్, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, కుమార్ గౌడ్,జగన్నాథ్ రెడ్డి, పరమేష్ యాదవ్,భాస్కర్ ముదిరాజ్,గౌస్,బూన్ తదితర ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.