కల్వకోల్‌లో బీఆర్ఎస్ నేతల అసంతృప్తి సెగలు*
*కల్వకోల్‌లో బీఆర్ఎస్ నేతల అసంతృప్తి సెగలు*
* పార్టీ కోసం పదేళ్లుగా పనిచేసిన నేతలకు ప్రాధాన్యత లేదా?
* కొండని లక్ష్మణ్ వర్గానికి సమాచారం ఇవ్వకుండానే సబితా ఇంద్రారెడ్డి పర్యటన
* ఇండిపెండెంట్‌గా గెలిచిన సర్పంచ్‌ను అభినందించిన మాజీ ఎమ్మెల్యే
* సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోతే పరామర్శించడానికి ఎమ్మెల్యే కూడా రాలేదు: కొండని లక్ష్మణ్
*మహేశ్వరం(నవంబర్ 06):*
మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయి. పార్టీ కోసం గత పది సంవత్సరాలుగా నిరంతరం పనిచేస్తూ, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సబితా ఇంద్రారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.కల్వకోల్ గ్రామానికి చెందిన కొండని ప్రేమలత భర్త కొండని లక్ష్మణ్ గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదేవిధంగా గ్రామానికి చెందిన ఎనిమిది మంది వార్డు సభ్యులు కూడా పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనా పార్టీని నమ్ముకుని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నామని కొండని లక్ష్మణ్ వర్గం చెబుతోంది.
*పార్టీ నేతలకు సమాచారం లేకుండానే పర్యటన..*
ఇటీవల కల్వకోల్ గ్రామంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వ్యవహారశైలి ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.గ్రామంలో పార్టీ కోసం పనిచేసిన కొండని లక్ష్మణ్ వర్గానికి, అలాగే గతంలో పార్టీ తరఫున పోటీ చేసిన వార్డు సభ్యులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆమె గ్రామంలో పర్యటించడం అసంతృప్తికి కారణమైనట్లు తెలుస్తోంది.ఈ పర్యటనలో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్‌గా విజయం సాధించిన బక్కని లక్షమ్మ ఇంటికి వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి ఆమెను అభినందించారు. అనంతరం కేకే బస్తీకి చెందిన మాజీ సర్పంచ్ థామస్ రెడ్డి ఇంటికి వెళ్లి అల్పాహారం స్వీకరించి అక్కడి నుంచి బయలుదేరారు.
*భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయం?*
అయితే పార్టీ కోసం ఇన్నాళ్లూ కష్టపడిన తమకు కనీస సమాచారం లేకుండా పర్యటన సాగించడం పట్ల కొండని లక్ష్మణ్ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. పార్టీ తరుపున సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోతే కనీసం పరామర్శించడానికి కూడా రాలేదని కొండని లక్ష్మణ్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండని లక్ష్మణ్ వర్గం తమ భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై త్వరలోనే తమ అభిప్రాయాలను వెల్లడిస్తామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి గుర్తింపు దక్కుతుందా? లేక కల్వకోల్ బీఆర్ఎస్లో అసంతృప్తి మరింత ముదురుతుందా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
పాల జనార్ధన్, మేజర్ న్యూస్