కార్మికుల భద్రతలో నిర్లక్ష్యాన్ని సహించం ఎమ్మెల్యే
జిన్నారం:పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, వారి ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గడ్డపోతారం పారిశ్రామికవాడలోని సరాక పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం తీవ్ర విచారకరమన్నారు. మరో ఆరుగురు ప్రాణాపాయ స్థితిలో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరు శుక్రవారం ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయ్యాడు. క్లోరో ఫామ్ గ్యాస్ లీకై ప్రమాదం జరిగింది. నైట్ షిఫ్ట్ లో 48 మంది కార్మికులు పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే జిఎంఆర్ పరిశ్రమ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల ప్రాణాలతో యాజమాన్యాలు చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు. కచ్చితంగా భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. సిగాచి ఘటన నుంచి గుణపాఠం నేర్చుకొని ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.70 లక్షల పరిహారం, అంత్యక్రియల కోసం రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. “పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కార్మికుల భద్రతను విస్మరించకూడదు. ప్రతి పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలి. సరాక ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ నెహ్రూ, కమిషనర్ పి.తాన్య డీఎస్పీ, సిఐ లు, తహసిల్దార్ ఆంటోనీ, మున్సిపల్ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, స్థానిక నాయకులు ప్రకాశం చారి, గద్దె గణేష్, కుమార్ యాదవ్, పెంటేష్ , తదితరులు పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.