ఆత్మకూరు అభివృద్ధే లక్ష్యం, కూటమి అభ్యర్థుల విజయమే సంకల్పం!
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పురపాలక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి సమన్వయంతో ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమికి ప్రజల నుంచి పెరుగుతున్న మద్దతుకు వైసీపీ నుంచి టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలే నిదర్శనమని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ఆత్మకూరులోని తెలుగుదేశం కార్యాలయం అయిన రవితేజ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.ఆత్మకూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ప్రముఖులు, వైసీపీ కార్యకర్తలు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో మరిన్ని చేరికలు జరగనున్నాయని పేర్కొన్నారు.కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు పసుపు కండువాలు కప్పి మంత్రి ఆనం సాదరంగా ఆహ్వానించారు.ప్రజలకు మేలు చేసే ప్రభుత్వంపై విశ్వాసంతోనే నాయకులు, కార్యకర్తలు ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారని, రానున్న ఎన్నికల్లో ఈ ఐక్యత కూటమి విజయానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
బీసీలు, మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే కూటమి లక్ష్యం
స్థానిక సంస్థల్లో బీసీలు, దళితులు, మహిళలు, బలహీన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఆనం తెలిపారు.స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పానికి విరుద్ధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. బీసీలు రాజకీయంగా ఎదగడం, మహిళలు అధికారంలో భాగస్వాములు కావడం వైసీపీకి ఇష్టం లేదని ఆరోపించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వర్గానికి సముచిత స్థానం కల్పించడం ప్రభుత్వ బాధ్యతని, సామాజిక న్యాయం, సమాన అవకాశాల దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు.
రాజకీయ కక్షలకు తావులేదు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి
రాష్ట్రంలో రాజకీయ కక్షలు, దాడులకు తావులేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని మంత్రి ఆనం ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, రాజకీయ పార్టీలన్నీ రాజ్యాంగ విలువలను గౌరవించాలని సూచించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రాజకీయాలు చేయాలని అన్నారు.ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగానిర్వహించేందుకు అవసరమైన సమన్వయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరిస్తూ, ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
సూపర్ సిక్స్ హామీల అమలే మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, యువనాయకుడు నారా లోకేశ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, రైతుల సంక్షేమం, యువతకు అవకాశాలు, మహిళల సాధికారత, బలహీన వర్గాల అభ్యున్నతి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని వివరించారు.
ఆత్మకూరును రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
గత కొన్నేళ్లుగా ఆత్మకూరు నియోజకవర్గం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని మంత్రి ఆనం అన్నారు. ఆత్మకూరును ఆంధ్రప్రదేశ్‌లోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్గదర్శకత్వంలో, కూటమి నాయకులసహకారంతో పట్టణాభివృద్ధికిప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఆత్మకూరు ప్రాంతంలో వ్యవసాయానికి నీటి సదుపాయాలు కల్పించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండో పంటకు అనుకూల పరిస్థితులు పరిమితంగా ఉన్నప్పటికీ, ఆత్మకూరు ప్రాంతంలో పంపింగ్ స్కీమ్ ద్వారా వేలాది ఎకరాల్లో రెండో పంట సాగవుతుండటం సంతోషకరమన్నారు. రైతుల కళ్లలో ఆనందం చూడటం, వారి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావడం, పట్టణాలు మరియు గ్రామాలు అభివృద్ధి చెందడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఆనం స్పష్టం చేశారు. ఆత్మకూరు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాను బలపరచడం సంతోషంగా ఉందని మంత్రి ఆనం తెలిపారు.డాక్టర్ షకీలా కుటుంబం చాలా కాలంగా ఆత్మకూరు ప్రాంత ప్రజలతో మమేకమైందని, ఆమె మామ డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి దశాబ్దాలుగా వైద్య సేవలందించి మంచి పేరు సంపాదించారని పేర్కొన్నారు. ఆమె భర్త డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి,కుటుంబ సభ్యులు కూడా వివిధ రాజకీయ హోదాల్లో ప్రజలకు సేవలందించారని తెలిపారు. వైద్య వృత్తి ద్వారా ప్రజలకు సేవలందించిన డాక్టర్ షకీలా, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా మరింత విస్తృతంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. మహిళా నాయకత్వానికి, విద్యావంతులకు, ప్రజలతో అనుబంధం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆత్మకూరు పట్టణ అభివృద్ధికి కొత్త దిశ చూపించాలన్నది కూటమి లక్ష్యమని చెప్పారు.. మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాతో పాటు టీడీపీ తరఫున 25 వార్డుల్లో, జనసేన, బీజేపీ తరఫున మూడు వార్డుల్లో బరిలో ఉన్న కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తున్నారని వివరించారు. ఆత్మకూరు పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు కూటమి అభ్యర్థులకు ఆశీస్సులు అందించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో ఎన్డీఏ కూటమి విజయంతో పట్టణ అభివృద్ధికి మరింత వేగం తీసుకొస్తామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
ప్రతి గడపకూ వెళ్లి ప్రభుత్వ విజయాలను వివరిస్తాం
ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి కుటుంబాన్ని కలుసుకుని ప్రభుత్వ విజయాలను వివరిస్తామని చెప్పారు. ప్రజల మద్దతు, కార్యకర్తల కృషి, కూటమి నాయకుల ఐక్యతతో ఎన్నికల్లో విజయం సాధిస్తామనే విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని, ఆత్మకూరు అభివృద్ధికి సహకరించే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు, మున్సిపల్ తెలుగుదేశం చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా తనయుడు బొమ్మిరెడ్డి తారక్ నాధ్ రెడ్డి,పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడు, కాటంరెడ్డి రవీంద్రారెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం లీలా కైవల్యా రెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి, నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకుడు కేతా విజయభాస్కర్ రెడ్డి, ఆత్మకూరు మాజీ మండలాధ్యక్షుడు కేతా వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల మాధవి, మండల తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఆత్మకూరు మండల జెడ్పిటిసి తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి,ఏ ఎం సి వైస్ చైర్మన్ గొట్టిగుండాల బుజ్జిరెడ్డి,సీనియర్ తెలుగుదేశం నాయకుడు చల్లా రవికుమార్ రెడ్డి,తెలుగుదేశంలో చేరిన సంగం పి ఏ సి ఎస్ మాజీ చైర్మన్ పందిళ్లపల్లి శివకుమార్ రెడ్డి,పట్టణ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి తోడేటి వెంకటయ్య,మాజీ కౌన్సిలర్లు సూరా భాస్కర్ రెడ్డి,పొడమేకల పెంచలయ్య యాదవ్, షేక్ రేష్మ,ఆత్మకూరు మున్సిపాలిటీకి కౌన్సిల్ అభ్యర్థులుగా తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు, తెలుగుదేశం క్లస్టర్ ఇంచార్జ్ లు తలచీరు బాబు నాయుడు, పి.సాగర్, బిజెపి సీనియర్ నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి, కరటంపాటి సుధాకర్,పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.