నిర్మాణ రంగానికి కొత్త ఊపు: మార్కెట్లోకి మళ్లీ ‘వైజాగ్ టీఎంటీ’
గాజువాక, సూర్య : నిర్మాణ రంగంలో నాణ్యతకు మారుపేరుగా నిలిచిన ‘వైజాగ్ టీఎంటీ’ రీబార్లు తిరిగి మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. ఆర్‌ఐఎన్‌ఎల్ - విశాఖ ఉక్కు కర్మాగారం తన ప్రధాన ఉత్పత్తుల్లో అత్యంత కీలకమైన టీఎంటీ కడ్డీల రోలింగ్‌ను అక్టోబరు మధ్య నుంచి పునఃప్రారంభించింది. దీంతో బహిరంగ మార్కెట్లో వైజాగ్ స్టీల్ టీఎంటీ రీబార్ల లభ్యత ఒక్కసారిగా పెరిగింది.
దేశీయ నిర్మాణ రంగంలో, ముఖ్యంగా గృహ నిర్మాణాలు, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ‘వైజాగ్ టీఎంటీ’ అత్యంత విశ్వసనీయమైన, ప్రాచుర్యం పొందిన బ్రాండ్‌గా కొనసాగుతోంది. వివిధ సైజులలో ఈ రీబార్లు అందుబాటులోకి రావడం పట్ల డీలర్లు, బిల్డర్లు, వినియోగదారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత, పటిష్ఠత, భద్రతకు సంబంధించి విశాఖ స్టీల్‌పై ఉన్న నమ్మకం ఈ సరఫరాతో మరింత బలపడిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. నాణ్యమైన కడ్డీలు మళ్లీ మార్కెట్‌ను పలకరించడం నిర్మాణ పనులకు కొత్త ఊపునిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రిపోర్టర్ : కోటి రెడ్డి, గాజువాక, విశాఖపట్నం.