కొత్తగూడ లో ఉచిత కంటి వైద్య శిబిరం
కొత్తగూడ, మేజర్ న్యూస్, కొత్తగూడ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్ట్, సూర్య కంటి హాస్పిటల్ (రెడ్డి బజార్, మహబూబాబాద్) సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం మరియు శస్త్రచికిత్సల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రశంసా పత్ర గ్రహీత, లయన్స్ క్లబ్ ప్రతినిధి మరియు ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ అడ్డిచర్ల మాధవరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో భాగంలో మూడవ విడతగా ఈరోజు (శుక్రవారం) 13 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా కంటి ఆపరేషన్లు పూర్తి చేసి వారికి ఉచితంగా కళ్లజోళ్లను అందజేశారు. అంతకుముందు మొదటి విడతలో 26 మందికి, రెండవ విడతలో 18 మందికి విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అడ్డిచర్ల మాధవరావు గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న పేదలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కంటిలో పొర ముదిరి చూపు మందగించిన వారిని గుర్తించి, వారికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఆధునిక పద్ధతుల్లో ఉచితంగా శస్త్రచికిత్సలు అందిస్తున్నామని పేర్కొన్నారు. చూపు సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ, పంచాయతీ కార్యదర్శి దివాకర్, సూర్య కంటి హాస్పిటల్ వైద్య సిబ్బంది, ట్రస్ట్ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
రిపోర్టర్: వెంకటేశ్వర్లు, కొత్తగూడ, మహబూబాబాద్ జిల్లా