andhrapradesh
హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్.. నామినేషన్ల గడువు పొడిగించాలని విజ్ఞప్తి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. తమ పార్టీ అభ్యర్థులను అరెస్టులు, గృహనిర్బంధాలు చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణకు హైకోర్టు అనుమతించింది. అదుపులో ఉన్న తమ అభ్యర్థులను వెంటనే విడుదల చేసి నామినేషన్లకు భద్రత కల్పించాలని, నామినేషన్ల గడువును కనీసం 48 గంటలు పొడిగించాలని పిటిషన్‌లో కోరారు. అలాగే స్థానికంగా దాడులు జరుగుతున్నందున జిల్లా కార్యాలయాలు, కలెక్టరేట్లలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ పత్రాలు చించేస్తున్నారని, దాడులకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేయాలని వైసీపీ కోర్టును ఆశ్రయించింది.