జిల్లా గ్రంథాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పోటీ పరీక్షల అభ్యర్థులకు పలు సూచనలు
రంగారెడ్డి : బడంగ్‌పేట్‌లోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డాక్టర్ కె. కిరణ్మయి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో పాఠకులకు అందుతున్న సేవలు, పుస్తకాల లభ్యత, మౌలిక సదుపాయాలు, నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రంథాలయానికి వచ్చిన పాఠకులతో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల చదువు, సన్నద్ధతపై ఆరా తీశారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే పక్కా ప్రణాళికతో చదవాలని, సమయపాలన పాటిస్తూ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. అందుబాటులో ఉన్న పుస్తకాలు, అధ్యయన సామగ్రిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ప్రస్తుత అంశాలపై అవగాహన పెంచుకోవడంతోపాటు, చదివిన అంశాలను ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని, భవిష్యత్తు లక్ష్యాలను చేరుకునేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
గ్రంథాలయంలోని సౌకర్యాలు, అధ్యయన వాతావరణాన్ని పరిశీలించిన ఆమె.. పాఠకులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ తనిఖీలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.జి.వి. రాణి, గ్రంథాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
(రంగారెడ్డి - మేజర్ న్యూస్)