జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి – ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్:జవహర్ నగర్ డంపింగ్ యార్డు కాలుష్య నియంత్రణ మరియు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ మురళీ మనోహర్ అధ్యక్షత వహించగా, పర్యావరణ వేత్తలు, మేధావులు, డంపింగ్ యార్డు బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ,.. జవహర్ నగర్ ప్రాంతం 30 కిలోమీటర్ల పరిధిలో కాలుష్యంతో నరకకూపంగా మారిందని, ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం – 27 నుంచి పాదయాత్ర:
డంపింగ్ యార్డు సమస్యపై ఈ నెల 27వ తేదీ నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు ఎంపీ ప్రకటించారు. బాధితులు ఇంటికి ఒకరు ఈ పోరాటంలో కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ తరహాలో జీరో పొల్యూషన్ టెక్నాలజీతో చెత్తను రీసైకిల్ చేసి విద్యుత్, బయోగ్యాస్, ఆర్గానిక్ ఎరువులు తయారుచేసే ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, కేంద్రం నుంచి నిధులు తెప్పించే బాధ్యత తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్క కిలో చెత్త కూడా జవహర్ నగర్‌కు రాకుండా, ఉన్న చెత్తను క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం చేయకూడదు:
రాంకీ సంస్థ సీఎస్‌ఆర్ నిధులను స్థానిక ప్రజలకు ఖర్చు చేయకుండా మళ్లించడంపై మండిపడ్డారు. "గొప్ప పదవి రావడం కాదు.. ఆ పదవికి ఎంత న్యాయం చేస్తున్నాం అనేది ముఖ్యం. రేవంత్ రెడ్డి కాలగర్భంలో కలిసిపోతారా? గుర్తుండిపోయేలా ఉంటారా? నిర్ణయించుకోవాలి. పాలకులకు వ్యక్తిగత కక్షలు ఉండకూడదు" అని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు,పలువురు బాధితులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.