ఇండో–శ్రీలంక మైత్రి సేతు అంతర్జాతీయ సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
ఇండో–శ్రీలంక మైత్రి సేతు అంతర్జాతీయ సైకిల్ యాత్రలో భాగంగా డిసెంబర్ 22న నిర్మల్ జిల్లాకు చేరుకోనున్న సైక్లింగ్ బృందానికి ఘన స్వాగతం పలికేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
సైక్లింగ్ బృందానికి వసతి, ఆతిథ్య సౌకర్యాలు కల్పించడంతోపాటు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. యాత్ర ఆదిలాబాద్ జిల్లా వైపు సజావుగా సాగేందుకు అనువైన రూట్ మ్యాప్ రూపొందించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఇలాంటి అంతర్జాతీయ సైకిల్ యాత్రలు భారత్–శ్రీలంక దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఇన్‌ఛార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, ఏఎస్పీ ఉపేంద్ర రెడ్డి, డీఎంహెచ్‌వో రాజేందర్, డీవైఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, 32వ బెటాలియన్ ఎన్‌సీసీ ప్రతినిధి సంజీవ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.