telangana
హెచ్‌ఎంపై మండల విద్యాశాఖ అధికారికి తల్లిదండ్రుల ఫిర్యాదు - మద్యం సేవించి విధులకు వస్తున్నారంటూ విద్యార్థుల ఆరోపణలు
సూర్య తిర్యాణి : తిర్యాణి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావుపేట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ విధి నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రులు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ)కి ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారంటూ విద్యార్థులు చేసిన ఆరోపణలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.మూడు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని విద్యార్థులు పేర్కొన్నారు. పాఠశాల స్టోర్‌రూమ్‌లో మద్యం కూడా లభించినట్లు సమాచారం. ఈ అంశాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.విద్యార్థులకు చదువు నేర్పించడంతోపాటు పాఠశాల నిర్వహణను పర్యవేక్షించాల్సిన ప్రధానోపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో విద్యాబోధన సక్రమంగా సాగేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.