రాజమహేంద్రవరం లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన
నేటి దినపత్రిక సూర్య బ్యూరోరాజమహేంద్రవరం :
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వరుస తుపాన్ల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ఇటీవల అర్నాబ్ తుపాన్ కారణంగా నగరంలో ఏర్పడిన ఇబ్బందులను అధిగమించి, సహాయక చర్యల ద్వారా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తాజాగా మురసు తుపాన్ ప్రభావంతో మరోసారి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని ప్రధాన నీట మునిగే ప్రాంతాలైన కోరుకొండ రోడ్డు, రామకృష్ణ మఠం రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ కంబాల చెరువు జంక్షన్ వద్ద వర్షపు నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రూ.25 కోట్లతో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసినట్లు తెలిపారు. వర్షాలు తగ్గిన వెంటనే ఆ పనులను ప్రారంభిస్తామన్నారు. రామకృష్ణ మఠం రోడ్డులో మేజర్ కల్వర్టు సామర్థ్యాన్ని పెంచేందుకు సుమారు రూ.65 లక్షలతో పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. కోరుకొండ రోడ్డులోని అమ్మవారి ఆలయం సమీపంలో నీటి ఒత్తిడిని తగ్గించేందుకు క్రాస్ బాక్స్ కల్వర్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశామన్నారు. ఈ పనులు పూర్తయితే మోర్ డిపార్ట్‌మెంట్ స్టోర్, సీటీఆర్‌ఐ క్వార్టర్స్, రామకృష్ణ మఠం పరిసర ప్రాంతాల్లో వర్షపు నీటి ఒత్తిడి సుమారు 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వివరించారు. అదేవిధంగా రహదారి వాలు, నీటి ప్రవాహ దిశపై అధికారులు, స్థానిక నాయకులతో కలిసి సమగ్రంగా అధ్యయనం చేస్తామన్నారు. అవసరమైతే డివైడర్లకు నీటి ప్రవాహానికి అనుకూలంగా మార్పులు చేసి, మరో మేజర్ డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని ఇతర నీట మునిగే ప్రాంతాల సమస్యలను కూడా గుర్తించి శాశ్వత పరిష్కారాలు చూపేందుకు అధికారులతో సమీక్షిస్తామని చెప్పారు. రాత్రి సమయంలోనూ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఎమ్మెల్యే వాసు విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే స్థానిక కూటమి నాయకులు, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు.