సిరా చుక్కే.. మండల భవితకు దిక్సూచి!
బాడంగి, సూర్య : ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధానికి ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. ఓటరు వేలిపై పడే ఒక్క సిరా చుక్క ఐదేళ్ల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుంది. ప్రజల ఆకాంక్షలు, గ్రామాల అభివృద్ధి, పాలనలో మార్పులకు పునాది వేస్తుంది. ఈ నేపథ్యంలో బాడంగి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మండలంలోని 25 గ్రామ పంచాయతీల పరిధిలో 14 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. 14 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 31 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అదేవిధంగా ఒక జడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో మండలంలో స్థానిక ఎన్నికలపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలు కేవలం అభ్యర్థుల గెలుపోటములకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో మండల అభివృద్ధికి ఎలాంటి నాయకత్వం ఉండాలనే అంశాన్ని నిర్ణయించనున్నాయి.
ఓటు అభివృద్ధికి పునాది!
ఎన్నికల సమయంలో వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రలోభాలు, తాత్కాలిక హామీలకు ప్రభావితం కాకుండా ఓటర్లు విచక్షణతో నిర్ణయం తీసుకోవాలి. అభ్యర్థుల వ్యక్తిత్వం, ప్రజాసేవా దృక్పథం, ప్రజలకు అందుబాటులో ఉండే తత్వం, స్థానిక సమస్యల పరిష్కారంలో చొరవ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటుకూ సమాన విలువ ఉన్నందున ఒక్క ఓటును కూడా నిర్లక్ష్యం చేయకూడదు.
ముఖ్యంగా యువత, మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు వేయాలి. ఎందుకంటే ఈరోజు వేసే ఓటే రేపటి గ్రామాల రూపురేఖలను నిర్ణయిస్తుంది. నాయకులను ఎన్నుకునే అధికారం ప్రజల చేతుల్లోనే ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే అభివృద్ధి ఫలాలు అందరికీ చేరుతాయి. ఓటు హక్కు కేవలం రాజ్యాంగం కల్పించిన అవకాశం మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి బాధ్యత కూడా. వేలిపై పడే సిరా చుక్క చెరిగిపోవచ్చు.. కానీ ఆ ఓటుతో తీసుకున్న నిర్ణయం మండల భవిష్యత్తుపై చెరగని ముద్ర వేయాలి.