పోలింగ్ కేంద్రాలకు సామగ్రి పంపిణీ...!
ఆనందపురం, సూర్య : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆనందపురం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో చేపట్టిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండల పరిధిలోని 65 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, ఓట్ల లెక్కింపు హాలును సందర్శించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఆరుగురు చొప్పున సిబ్బందిని కేటాయించినట్లు అధికారులు వివరించారు. మొత్తం 65 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది, ఎన్నికల సామగ్రి సకాలంలో చేరవేసేందుకు ఐదు జోన్లు, ఏడు రూట్లుగా విభజించి చేపట్టిన ఏర్పాట్లను జేసీ పరిశీలించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, సిబ్బంది తరలింపు, వాహనాల కేటాయింపు, విధుల నిర్వహణకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సిబ్బందికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కౌంటింగ్ హాలులో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో సమన్వయంతో వ్యవహరిస్తూ నిర్దేశిత మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో జనరల్ అబ్జర్వర్, జీసీసీ ఎండీ శోభిక, సంబంధిత ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.