ఎన్నికలకు సర్వం సిద్ధం!
లక్కవరపుకోట, సూర్య : లక్కవరపుకోట మండలంలో గురువారం జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి భానులత తెలిపారు. మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఎన్నికల సిబ్బందిని ప్రత్యేక వాహనాల ద్వారా తరలించినట్లు ఆమె తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రెవెన్యూ, పోలీస్‌శాఖలతో పాటు ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మండలంలోని 31 గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన 40 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు రిటర్నింగ్ అధికారి భానులత వివరించారు.