గోదావరి పుష్కర పనులు సకాలంలో పూర్తి చేయాలి - దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశం
సూర్య - పెద్దపల్లి : రానున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి పెండింగ్ పనులను నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. శనివారం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పుష్కర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజా రామయ్యర్ మాట్లాడుతూ నూతన పుష్కర ఘాట్ల నిర్మాణం, పాత ఘాట్ల మరమ్మతులను వేగవంతం చేయాలని సూచించారు. భక్తులకు సురక్షిత తాగునీరు, ఆకర్షణీయమైన లైటింగ్, మెరుగైన పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. నిర్మాణ పనులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేసి, అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.