తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు 10 కోర్సుల్లో 378 ఖాళీ సీట్లు.. నవంబర్ 7న ప్రవేశాల ప్రక్రియ
సంగారెడ్డి: తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి), సంగారెడ్డిలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ కోర్సుల్లో మిగిలి ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. ప్రవీణ తెలిపారు. ఈ మేరకు నవంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను కళాశాలలో స్వీకరించనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 7, 2026 (శనివారం)న టీజీసిపిజిఈటి -2026 స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
10 పీజీ కోర్సుల్లో 378 ఖాళీలు
కళాశాలలో ప్రస్తుతం మొత్తం 10 పీజీ కోర్సుల్లో 378 సీట్లు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. ఇందులో ఎం.ఏ. ఇంగ్లీష్‌లో 48, తెలుగు 32, పొలిటికల్ సైన్స్ 38, ఎం.కామ్‌లో 39, ఎం.ఎస్సీ బోటనీలో 37, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 7, కంప్యూటర్ సైన్స్‌లో 51, మ్యాథమెటిక్స్‌లో 55, ఫిజిక్స్‌లో 54, జువాలజీలో 17 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
పరీక్ష రాయని వారికి కూడా అవకాశం
టీజీసిపిజిఈటి-2026 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులతో పాటు అర్హత సాధించని వారు, పరీక్షకు హాజరుకాని అభ్యర్థులు సైతం సంబంధిత కోర్సుల అర్హత నిబంధనలకు లోబడి స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు భారతీయ పౌరులై, తెలంగాణ రాష్ట్రానికి చెందినవారై ఉండాలని స్పష్టం చేశారు. స్థానిక, అన్‌రిజర్వుడ్ కేటగిరీలకు సంబంధించి జిఓ ఎంఎస్ నెంబర్ .15, ఉన్నత విద్యాశాఖ, తేదీ 27-02-2026 నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరి
స్పాట్ అడ్మిషన్లలో పాల్గొనే విద్యార్థులు స్వయంగా కళాశాలకు హాజరై ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను సమర్పించాలని సూచించారు. టీజీసిపిజిఈటి ర్యాంక్ కార్డు (ఉంటే), ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్, కన్సాలిడేటెడ్ మార్కుల మెమో, స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, అవసరమైన వారు ఈక్వివలెన్స్ సర్టిఫికెట్ తీసుకురావాలని తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేని అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించబడవని స్పష్టం చేశారు.
రూ.2,100 ప్రాసెసింగ్ ఫీజు
స్పాట్ అడ్మిషన్ల ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని ప్రిన్సిపాల్ వెల్లడించారు. అడ్మిషన్ సమయంలో కళాశాలలో రూ.2,100 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అర్హత కలిగిన విద్యార్థులు నవంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు సంబంధిత సర్టిఫికెట్లను కళాశాలలో సమర్పించి, నవంబర్ 7న నిర్వహించే స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనాలని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. ప్రవీణ కోరారు.మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్: 9908993551 (రాజు).