ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
*జిల్లా వ్యాప్తంగా 559 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ – మధ్యాహ్నం నాటికి పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 304 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ
ఓటర్లందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
*జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి బ్యూరో, మేజర్ న్యూస్: తిరుపతి జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాలు, తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం ఉదయం ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
ఆదివారం ఉదయం తిరుపతి మున్సిపల్ పరిధిలోని శ్రీ పద్మావతి గర్ల్స్ హైస్కూల్, 25 వ వార్డు, 1,2,3, పోలింగ్ కేంద్రాలలో, అక్కారం పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 60 వ వార్డు 1,2 పోలింగ్ కేంద్రాలను, తిమ్మినాయుడు పాళ్యం ఎంపీపీ స్కూల్, 1 వ వార్డు,1, 2 వ పోలింగ్ కేంద్రం, సత్యనారాయణపురం లోని జడ్పీ హైస్కూల్ 63 వ వార్డు, 1 నుండి 5 వరకు పోలింగ్ కేంద్రాలలో నందు లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. ఎం. వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియ, ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా మొత్తం 559 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతోందని తెలిపారు. ఉదయం 9 గంటల వరకు సుమారు 12 నుంచి 13 శాతం పోలింగ్ నమోదైందని, రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే స్థాయిలో పోలింగ్ కొనసాగుతోందని పేర్కొన్నారు. సమయం గడిచే కొద్దీ ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని, పోలింగ్ శాతం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే తాను పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడటంతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి కూడా అభిప్రాయాలు తెలుసుకున్నానని, అన్ని చోట్లా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం లో ఓటింగ్ జరిగితుందన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం 304 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామని, రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు జిల్లా కలెక్టరేట్ నుంచి నిరంతరం పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మిగిలిన నాలుగు పురపాలక సంఘాల్లో 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, మరో 50 శాతం కేంద్రాల్లో వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్ ప్రక్రియను రికార్డు చేస్తున్నామని వివరించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాలు, కేంద్రాల లోపల జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ ఎలాంటి భయం, ఒత్తిడికి లోనుకాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అర్హులైన ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మీ ఓటు మీ హక్కు, ప్రజాస్వామ్యానికి బలం అని జిల్లా కలెక్టర్ పునరుద్ఘాటించారు.
Raaju బ్యూరో,తిరుపతి జిల్లా,