ఎండిన వరి చేను... యువరైతు వినూత్న నిరసన, సాగునీరు, విద్యుత్ అందక మూడు ఎకరాలలో ఎండిన పంట, పెట్టుబడి కూడా దక్కదని ఆవేదన
గణపురం, మేజర్ న్యూస్
సాగునీరు, విద్యుత్ సరఫరా సకాలంలో అందక చేతికొచ్చిన వరి పంట కళ్లముందే ఎండిపోవడంతో ఓ యువరైతు వినూత్నంగా నిరసన తెలిపాడు. గణపురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు ప్రవీణ్ తన మూడు ఎకరాల వరి పొలం పూర్తిగా ఎండిపోవడంతో, ఆ చేనులోనే ద్విచక్ర వాహనంతో తిరుగుతూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా రైతు ప్రవీణ్ మాట్లాడుతూ.. పంటకు కీలకమైన సమయంలో విద్యుత్, సాగునీరు అందక వరి పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని వాపోయాడు. ఎంతో కష్టపడి సాగు చేసిన పంట కళ్లముందే ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయానని తెలిపాడు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పంట నష్టాన్ని పరిశీలించాలని, నష్టపోయిన రైతులను గుర్తించి ఆర్థిక సహాయం అందించాలని ప్రవీణ్ విజ్ఞప్తి చేశాడు. సాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించి రైతులకు అండగా నిలవాలని కోరాడు.
రిపోర్టర్ ;ఎల్లయ్య ,గణపురం జయశంకర్ భూపాలపల్లి జిల్లా