telangana
ఈ నెల 30న నగరంలో ఆటోల బందు
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ :
15 రోజుల్లో ఆటో మీటర్ చార్జీల పెంపుతో పాటు, డ్రైవర్ల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 30న నగరంలో ఆటోల బందు నిర్వహిస్తామని మహాత్మా గాంధీ తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ సీ కన్వీనర్ మహమ్మద్ అహ్మణుల్లా ఖాన్ వెల్లడించారు. ఆదివారం హైదర్గూడా ఎన్ఎస్ఎస్ భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో అనుమతించిన గ్రీన్ క్యాబులను వెంటనే రద్దు చేయాలని కోరారు. గుండాల చేతిలో హత్యకు గురైన ఆటో డ్రైవర్ మహమ్మద్ ముఖరం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న రూ .12 వేలు, మూడు సంవత్సరాలు గడిచిన ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు.. సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాద బీమాను కొనసాగిస్తూ సాధారణ మరణాలకు వర్తింపచేయాలన్నారు. అవసరమైన సంఖ్యలో ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆటో , ఉబర్, రాపిడో యాప్లకు బదులుగా ప్రభుత్వమే నూతన యాప్ తీసుకురావాలన్నారు. టూ వీలర్ టాక్స్ లను నిషేధించాలని కోరారు. ఆటో బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని కోరారు. కలెక్టర్ ఆదేశాలను బేకాతలు చేస్తున్న ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ను వెంటనే బదిలీ చేయాలన్నారు. ఈ సమావేశంలో నేతలు ముజాహిద్ హుస్సేన్, రమేష్ ,అబ్దుల్ రజాక్, ఆంజనేయులు, మహబూబ్ ,షేక్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు