గెలుపులో ముందంజ.. పదవిలో వెనుకంజ..! అరవపాలెం ఆశలకు అండ లభించేనా..! తెలుగుదేశం కంచుకోటగా నిలిపారు.. గుర్తింపు ఎప్పుడు ఇస్తారు..! నల్లారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేనా..! పార్టీ కోసం ప్రస్థానం.. పదవి కోసం ఎదురుచూపులు..! మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిపై స్థానికుల ఆశలు.నిర్ణయంపై ఆసక్తి
చిట్టమూరు మేజర్ న్యూస్
చిట్టమూరు మండల రాజకీయాల్లో అరవపాలెంకు సముచిత ప్రాధాన్యత కల్పించాలనే డిమాండ్ క్రమంగా బలపడుతోంది.రాజకీయంగా సుదీర్ఘ నేపథ్యం కలిగిన నల్లారెడ్డి కుటుంబం పార్టీ పటిష్టతకు,విజయాలకు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నప్పటికీ,కీలక పదవుల విషయంలో ఆశించిన గుర్తింపు దక్కలేదన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలో ఈనెల 19న జరగనున్న మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిని అరవపాలెంకు కేటాయించి నల్లారెడ్డి కుటుంబానికి అవకాశం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.ఇటీవల జరిగిన మండల ఎంపీటీసీ ఎన్నికల్లో 12 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోవడం పార్టీకి రాజకీయంగా బలాన్ని చేకూర్చింది.ఇందులో అరవపాలెం ఎంపీటీసీ అభ్యర్థి నల్లారెడ్డి మదాలస మండలంలో అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థుల్లో ఒకరిగా నిలవడం ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ నల్లారెడ్డి కుటుంబం నుంచి రాజేష్ రెడ్డి సర్పంచ్ పదవిని అత్యధిక మెజారిటీతో గెలుచుకోవడం గ్రామంలో ఆ కుటుంబానికి ఉన్న ప్రజాబలాన్ని తెలియజేస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నల్లారెడ్డి కుటుంబానికి మండల రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర ఉంది. 1995లో ఎంపీపీ పదవిని లక్ష్యంగా చేసుకుని నల్లారెడ్డి దశరథ రామిరెడ్డి ఆరూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా,అప్పటి నుంచి పదవుల కోసం కాకుండా పార్టీ అభివృద్ధి,ప్రజాసేవ,పార్టీ పటిష్టత కోసం పనిచేస్తూ వచ్చారని గ్రామస్థులు గుర్తుచేస్తున్నారు.రాజకీయ సమీకరణాల్లో భాగంగా అరవపాలెంకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్న అసంతృప్తి కూడా స్థానికుల్లో ఉంది. మండల రాజకీయాల్లో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించి అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించిన నాయకత్వం రెడ్డి సామాజిక వర్గానికి మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిలోనూ అవకాశం కల్పించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.అందులోనూ పార్టీకి గట్టి మెజారిటీ అందించిన అరవపాలెం గ్రామాన్ని ఈసారి పరిగణనలోకి తీసు కోవాలని స్థానికులు కోరుతున్నారు. తిరుగులేని మెజారిటీలతో విజయం సాధించడంతోపాటు, పార్టీ పటిష్టత, క్రియాశీలక పనితీరుతో పంచాయతీని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చి మండల రాజకీయాల్లో పార్టీకి అండగా నిలిచిన గ్రామానికి, కుటుంబానికి తగిన గుర్తింపు ఇంకెప్పుడన్న ప్రశ్న ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.గ్రామంలో పార్టీ విజయానికి కృషి చేసిన నల్లారెడ్డి కుటుంబానికి మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి కట్టబెడితే అరవపాలెం ప్రజల ఆకాంక్షలకు గౌరవం లభించినట్లవుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.అయితే పదవి కేటాయింపులో నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. స్థానిక నాయకుల అభిప్రాయాలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుంది.. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం,తాజా ఎన్నికల ఫలితాలు, గ్రామ ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని అరవపాలెంకు అవకాశం కల్పిస్తుందా.. అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్