ఏపీకి పొంచి ఉన్న అతి తీవ్ర తుఫాన్ ముప్పు.. 'అక్వాన్'గా నామకరణం
విశాఖపట్నం/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తీవ్ర తుఫాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం ఇది చెన్నైకి 760 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ (సోమవారం) సాయంత్రానికి ఇది తుఫాన్‌గా మారనుండగా, దీనికి ఇరాన్ సూచించిన 'అక్వాన్' (Akvan) అనే పేరు పెట్టనున్నారు. ఈ తుఫాన్ రేపటికి (మంగళవారం) తీవ్ర తుఫాన్‌గా, ఆ తర్వాత అతి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి.
తుఫాన్ ప్రభావంతో ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు ప్రారంభం కానున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 19న కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.