దసరా పర్వదినోత్సవాన.. జమలాపురం వేంకటేశ్వరస్వామి, తక్కెళ్లపాడు లలితా రాజరాజేశ్వరి అమ్మవారికి మంత్రి పొంగులేటి కుటుంబం ప్రత్యేక పూజలు
సూర్య*ఎర్రుపాలెం:* విజయదశమి (దసరా) పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా ఆధ్యాత్మిక సందడి చేశారు. మంగళవారం ఎర్రుపాలెం మండలంలోని ప్రసిద్ధ జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంతో పాటు తక్కెళ్లపాడులోని శ్రీ లలితా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ వేళ దైవదర్శనం చేసుకుని స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు పొందారు.
*మాతృమూర్తి నుంచి మనవడి వరకు..*
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మాతృమూర్తి స్వరాజ్యమ్మ, సతీమణి మాధురమ్మ, కుమారుడు హర్షారెడ్డి - సోమారెడ్డి దంపతులు, మనుమరాలు మైరారెడ్డి, కుమార్తె సప్నిరెడ్డి, అల్లుడు అర్జున్‌రెడ్డి, మనవడు ఆరవ్‌రెడ్డిలతో కలిసి ఆలయాలకు వెళ్లారు. *మూడు తరాల కుటుంబ సభ్యులు ఒకేచోట చేరి..* భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొనడం విశేషం.
*వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు*
జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి కుటుంబానికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రదక్షిణలు చేసి భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. వేదపండితులు వేదమంత్రాల మధ్య ఆశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం తక్కెళ్లపాడులోని శ్రీ లలితా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలోనూ కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. దసరా పర్వదినాన అమ్మవారి దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకున్నారు. పండుగ వేళ కుటుంబ సభ్యులంతా కలిసి దైవసన్నిధిలో గడపడంతో ఆయా ఆలయాల్లో భక్తిమయ వాతావరణం నెలకొంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ