భూ రికార్డులకు డిజిటల్ భద్రత.. వివాదాలకు శాశ్వత పరిష్కారం!
కొండాపూర్ : భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూముల హద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలను డిజిటల్ రికార్డుల్లో నమోదు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం భూ రీసర్వే చేపట్టిందని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) పాండు, ఆర్డీవో రాజేందర్ సర్వే ఏ డి రాజు తెలిపారు. మండల పరిధిలోని చెర్ల గోపులారం గ్రామంలో శుక్రవారం ఉప తహసీల్దార్ వినయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన గ్రామసభలో వారు పాల్గొన్నారు
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామ పరిధిలో మొత్తం 447 ఎకరాల 7 గుంటల భూమి ఉందని, ఇందులో 144.35 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు, 302.12 ఎకరాల పట్టా భూములు ఉన్నట్లు వివరించారు. గతంలో నమోదైన భూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి గ్రామ పరిధిలోని భూములన్నింటినీ సమగ్రంగా సర్వే చేస్తామన్నారు. తొలుత గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, దేవాలయ భూముల హద్దులను గుర్తించి, అనంతరం పట్టా, వ్యవసాయ భూముల సర్వే నిర్వహిస్తామని తెలిపారు. డిజిటల్ సాంకేతికతతో కొలతలు నమోదు చేసి రోజుకు సుమారు 30 ఎకరాల వరకు సర్వే చేపడతామన్నారు.
డిజిటల్ రికార్డులతో భూ హక్కులకు భరోసా
రీసర్వే ద్వారా రైతుల భూముల ఖచ్చితమైన విస్తీర్ణం, సరిహద్దులు, సర్వే నంబర్లు, యాజమాన్య వివరాలకు స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో భూ వివాదాలు, హద్దుల సమస్యలు తగ్గడంతో పాటు భూ క్రయవిక్రయాలు, వారసత్వ బదిలీలు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఈ సర్వే దోహదపడుతుందన్నారు. సర్వే అనంతరం వివరాలపై అభ్యంతరాలు ఉంటే నిబంధనల ప్రకారం అప్పీల్ చేసుకోవచ్చని, అధికారులు పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. మండలంలో చెర్ల గోపులారానికి ప్రాధాన్యత ఇచ్చి భూ సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు రైతులు, పట్టాదారులు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్వేయర్ సుమలత ఆర్ ఐ లు నిఖిల్ శ్రీనివాస్ సర్పంచ్ మహేశ్వరి సతీష్, ఉప సర్పంచ్ పుణ్యమ్మ రాములు, వార్డు సభ్యులు పట్నం సురేష్, నవీన్, సుజాత, మంజుల, మాజీ సర్పంచ్ రత్నయ్య, జీపీఓలు రాఘవేందర్, రమేష్, పంచాయతీ కార్యదర్శి ప్రమీల, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.