telangana
భగవాన్ బీర్ష ముండా 151వ జయంతి వేడుకలు
సూర్య జైనూర్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, జైనూర్ మండలం, మార్లవాయి గ్రామంలో ఆదివాసీ విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బీర్‌సా ముండా 151వ జయంతి వేడుకలను గ్రామస్తులందరూ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భగవాన్ బీర్‌సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఘనంగా నివాళులర్పించారు. ఆయన త్యాగాలను, ఆదివాసీ సమాజ హక్కుల పరిరక్షణ కోసం సాగించిన పోరాటాలను స్మరించుకుంటూ జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. భగవాన్ బీర్‌సా ముండా కేవలం ఒక స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదని, ఆదివాసీ ఆత్మగౌరవానికి, స్వాభిమానానికి, హక్కుల సాధనకు ప్రతీకగా నిలిచిన గొప్ప మహనీయుడని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకుల దోపిడీ, అన్యాయాలు, ఆదివాసీల భూముల ఆక్రమణలకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు.1875 నవంబర్ 15న జన్మించిన భగవాన్ బీర్‌సా ముండా చిన్న వయస్సులోనే ఆదివాసీ సమాజంలో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని నింపారు. జల్, జంగల్, జమీన్ (నీరు, అడవి, భూమి) హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడారు. బ్రిటిష్ పాలకుల అణచివేతకు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా 'ఉల్గులాన్' (మహా తిరుగుబాటు) ఉద్యమానికి నాయకత్వం వహించి ఆదివాసీలలో ఐక్యత, ధైర్యం, ఆత్మగౌరవాన్ని పెంపొందించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను నిర్బంధించగా, 1900 జూన్ 9న రాంచీ జైలులో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన చూపిన పోరాట మార్గం నేటికీ దేశవ్యాప్తంగా ఆదివాసీ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.బీర్‌సా ముండా ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, భాష, ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలని గ్రామస్తులు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ యువత ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆదివాసీల హక్కులు, భూమి, అటవీ సంపద పరిరక్షణ కోసం ఐకమత్యంతో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రామ పటేల్ ఆత్రం మాణిక్ రావు, దేవారి కనక గణపత్ రావు, ఉపసర్పంచ్ ఆత్రం రాజేశ్వర్, ఉపాధ్యాయులు కనక వెంకటేశ్వర్ రావు, కనక సోనే రావు, రాయి సెంటర్ గీత ధర్, ఆత్రం భగవంత్, మాజీ కనక కొద్దు, హన్మంత్ రావు, గ్రామస్తులు రాజు, ఆనంద్, సింగు, సీతారాం, సోనేరావు, తుకారాం, గజపతి, యేసు, సుదర్శన్, నాగేష్, దేవాషా,రాము, జంగు,లచ్చు,సోము, సుంగు,హైమన్ డార్ఫ్ యూత్ సభ్యులు మరియు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.