భారత ఉక్కు మహిళ ఇందిరాగాంధీః మంత్రి వాకిటి
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరొందిన భారతరత్న ఇందిరాగాంధీ 109వ జయంతి సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా నివాళులర్పించారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వ పరిరక్షణ కోసం అచంచల ధైర్యంతో పనిచేసిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని మంత్రి కొనియాడారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో అసాధారణ నాయకత్వ పటిమతో భారత్‌ను ప్రపంచ వేదికపై శక్తిమంతమైన దేశంగా నిలిపారని పేర్కొన్నారు. గరీబీ హటావో’ నినాదంతో* పేదరిక నిర్మూలనకు కృషి చేయడం, బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవానికి ప్రోత్సాహం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమాలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని మంత్రి తెలిపారు. 1971 యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ ప్రదర్శించిన నాయకత్వం, బంగ్లాదేశ్ ఆవిర్భావంలో ఆమె పోషించిన చారిత్రక పాత్ర ఆమె దృఢ సంకల్పానికి నిదర్శనమని అన్నారు. ఇందిరమ్మ పేరు పేదలకు భరోసా.. ఇందిరమ్మ పాలన సంక్షేమానికి చిరునామా అని మంత్రి శ్రీహరి అభివర్ణించారు. ఇందిరాగాంధీ ఆశయాల స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. దేశం కోసం జీవించి, దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ జీవితం నేటి తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఆశయాలే మా మార్గదర్శకం.. పేదల సంక్షేమమే మా ప్రభుత్వ సంకల్పం అని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.