telangana
యువతలో క్రీడలపట్ల ఆసక్తిని పెంపొందించాలి - కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఖేలో ఇండియా 8వ ఎడిషన్ క్రీడా పోటీలపై జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించి, ప్రజల్లో ముఖ్యంగా యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ గోడం నాగేశ్‌తో కలిసి ఖేలో ఇండియా 8వ ఎడిషన్‌కు సంబంధించిన ప్రచార పోస్టర్లు, లోగోలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఖేలో ఇండియా 8వ ఎడిషన్ నిర్వహణలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం లభించడం గర్వకారణమన్నారు. ఈ నెల 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ఖేలో ఇండియా ప్రచారానికి సంబంధించిన ‘పాలోపిట్ట’ లోగో, మస్కట్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు.జిల్లాలోని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రచార పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యువత, విద్యార్థులకు క్రీడల ప్రాధాన్యతను తెలియజేస్తూ వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసి, యువ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బి. అనూష, ప్రజాప్రతినిధులు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులు దయానంద్, పార్థసారథి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.