telangana
అద్విత యూత్ పార్లమెంట్ 2026 ప్రజాస్వామ్య స్ఫూర్తితో యువ స్వరాల ప్రతిధ్వని
సూర్య కరీంనగర్ : అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో నవంబర్ 19న నిర్వహించిన అద్విత యూత్ పార్లమెంట్ 2026 విజయవంతంగా ముగిసింది. 5, 6, 7 తరగతుల విద్యార్థులకు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంటరీ విధానాలు, పాలనా బాధ్యతలపై ప్రత్యక్ష అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వై. సునీల్ రావు , డిప్యూటీ మేయర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ కొమరయ్య సౌగాని, డైరెక్టర్ అనుదీప్ సౌగాని పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధికార పక్షం, ప్రతిపక్ష సభ్యులుగా విభజించుకుని దేశం ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలు, ప్రజా ప్రయోజన అంశాలు, ప్రభుత్వ విధానాలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై చర్చలు, వాదోపవాదాలు నిర్వహించారు. అధికార పక్షం ప్రభుత్వ చర్యలను సమర్థించగా, ప్రతిపక్షం ప్రశ్నలు సంధిస్తూ ప్రజల సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చింది. ఇరుపక్షాల మధ్య జరిగిన చర్చలు ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించాయి.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, విమర్శనాత్మక ఆలోచన, వక్తృత్వ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుత పౌరసత్వంపై అవగాహన పెంపొందాయి.డైరెక్టర్ అనుదీప్ సౌగాని దార్శనికత, ప్రోత్సాహం, సహకారంతో ఇటువంటి అనుభవాత్మక అభ్యసన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.