బాలాత్రిపురసుందరీ దేవిగా అమ్మవారి దర్శనం
శరన్నవరాత్రుల తొలి రోజు ప్రత్యేక పూజలు.. పాల్గొన్న ఈవో అంబుజ, చైర్మన్ కామేశ్వర్
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : సికింద్రాబాద్లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో అంబుజ, చైర్మన్ కామేశ్వర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.