ఇన్స్పైర్ ప్రాజెక్టుల్లో సంగారెడ్డి విద్యార్థుల సత్తా!
సంగారెడ్డి: శాస్త్రీయ ఆవిష్కరణల్లో సంగారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్ జాతీయస్థాయి పోటీల్లో జిల్లా నుంచి నాలుగు ప్రాజెక్టులు ప్రదర్శనకు ఎంపిక కాగా, ఇద్దరు విద్యార్థులు అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్. రోహిణి అభినందించారు.2023–24, 2024–25 విద్యా సంవత్సరాలకు సంబంధించిన 12వ ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్ జాతీయస్థాయి పోటీలు అక్టోబర్ 12 నుంచి 14 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు 52 ప్రాజెక్టులతో పాల్గొన్నారు. వీరిలో రాష్ట్రానికి చెందిన ఐదుగురు విద్యార్థులు టాప్-60లో స్థానం సంపాదించగా, సంగారెడ్డి జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు జాతీయస్థాయిలో తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. వారిలో ఇద్దరు విద్యార్థులు అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని, రాష్ట్రపతితో విందులో పాల్గొనే అవకాశం లభించనుంది. అలాగే హైస్కూల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా జపాన్‌లో జరిగే అంతర్జాతీయ కార్యక్రమానికి కూడా ఎంపికయ్యే అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
విద్యార్థుల ప్రాజెక్టులు ఇవే..
1. చౌడపురం సాయి మేఘన – ఆరిజిన్ టెక్నో స్కూల్, పటాన్‌చెరు: మిరియాల స్ప్రే, కంటిచూపును తాత్కాలికంగా అడ్డుకునే ఎల్‌ఈడీ లైట్లతో కూడిన అల్లర్ల నిరోధక కవచం రూపకల్పనకు సంబంధించిన ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ స్థాయికి ఎంపికైంది.
2. పూర్ణిత్ రెడ్డి – భారతీయ విద్యాభవన్, బీహెచ్‌ఈఎల్: కృత్రిమ మేధస్సు సహాయంతో దృష్టిలోపం ఉన్నవారికి సహాయపడే సాంకేతిక పరిష్కారాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ స్థాయికి ఎంపికైంది.
3. రుద్ర శరణ్య – పయనీర్ స్కూల్, సంగారెడ్డి: గృహ అవసరాల కోసం బహుళ ప్రయోజనాలతో ఉపయోగపడే వస్తు రవాణా సాధనాన్ని రూపొందించారు.
4. ఆయుష్ కుమార్ ఉపాధ్యాయ – సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, వడక్‌పల్లి, అమీన్పూర్: సమాచార మార్పిడిలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడంతోపాటు దృష్టిలోపం ఉన్నవారికి సహాయపడే పరికరాన్ని రూపొందించారు.
సమస్యలకు పరిష్కారాలు చూపే ఆవిష్కరణలు రావాలి: కలెక్టర్..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగి సంగారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు శాస్త్రీయ దృక్పథంతో నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. విద్యార్థులు తమ పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించుకుని దేశానికి ఉపయోగపడే శాస్త్రవేత్తలుగా స్థిరపడాలని అన్నారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతోపాటు వారి పాఠశాలల యాజమాన్యాలు, గైడ్ టీచర్లు, తల్లిదండ్రులను కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్. రోహిణి అభినందించారు. విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, శాలువాలు, జ్ఞాపికలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏడీ శంకర్, ఏఎంఓ బాలయ్య, జిల్లా సైన్స్ అధికారి పి. సిద్ధారెడ్డి, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వెంకటస్వామి, ఆరిజిన్ పాఠశాల కరస్పాండెంట్ ప్రమోద్, అలేఖ్య, వేణుగోపాలరెడ్డి, పద్మావతి, అశ్విన్ కుమార్, వెంకటేష్, రఘునందనరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.