బడి పిల్లలకు శుభవార్త... మహాదేవపూర్ లో ఘనంగా ప్రారంభమైన ఉచిత అల్పాహారం!
మహదేవపూర్, మేజర్ న్యూస్, మహదేవపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థుల ఆరోగ్యం, చదువును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన "పాఠశాలల్లో ఉచిత అల్పాహారం (టిఫిన్)" కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర పౌరసరఫరాలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. గ్రామ సర్పంచ్ హసీనా బాను అక్బర్ ఖాన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. ఉప సర్పంచ్ శ్రీజ సంతోష్, పాలకవర్గ సభ్యులు స్వయంగా విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని వడ్డించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణిస్తారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి,ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ & సభ్యులు, పాలకవర్గ సభ్యులు నల్ల బుగ్గ సమ్మయ్య, పడాల మొగిలి, మహమ్మద్ నయుముద్దీన్, చీర్లవంచ చంద్రశేఖర్, గడ్డం స్వామి, అస్రార్ ఖురేషి, మహమ్మద్ బిన్ అలీ, కొండపల్లి రాములు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్; ప్రకాష్, మహదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా