telangana
అవగాహన కార్యక్రమం
సూర్య తిమ్మాపూర్ : స్థానిక వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో గురువారం కళాశాల ప్రాంగణంలో ఒక ప్రత్యేక సదస్సు ఘనంగా నిర్వహించబడింది. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు చెందిన ప్రముఖ ఇండిపెండెంట్ ప్రిస్క్రైబర్, ఫార్మసిస్ట్ సాయి బాబు నర్ర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మిస్టర్ సాయి బాబు నర్రా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ. యూకే ఆరోగ్య రంగంలో కమ్యూనిటీ ఫార్మసిస్ట్ పాత్ర, వారి బాధ్యతలు ఎంత కీలకమైనవో వివరించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఫార్మసిస్టుల భాగస్వామ్యం గురించి ఆయన క్షుణ్ణంగా తెలిపారు. అంతేకాకుండా, యూకేలో ఫార్మసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న విభిన్న ఉద్యోగ అవకాశాలు, కెరీర్ ఎదుగుదల, అక్కడ స్థిరపడేందుకు అనుసరించాల్సిన ప్రణాళికల (కెరీర్ ప్లాన్స్) గురించి విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.విదేశాలలో కెరీర్ ప్రారంభించాలనుకునే విద్యార్థులు ఎలాంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, ఏయే అర్హతలు సాధించాలనే అంశాలపై ఆయన విద్యార్థులతో ముఖాముఖి చర్చించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఫార్మసీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సద్వినియోగం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో వాగేశ్వరి విద్యా సంస్థల ప్రధాన కార్యదర్శి డాక్టర్ గండ్ర శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి, మెంబర్లు వినోద్ మరియు సిహెచ్ ప్రకాష్ రెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి, అక్షయ రెడ్డి, విభాగాధిపతి డాక్టర్ శ్రవణ్ కుమార్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ ఎలిగేటి శ్రవణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.