రాష్ట్రంలో రెండో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు కియా ఒప్పందం : రూ.18,811 వేల కోట్ల పెట్టుబడి, మరో 12 వేల మందికి ఉద్యోగావకాశాలు
విశాఖపట్నం,మేజర్‌న్యూస్ :
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగ అభివృద్ధికి మరో భారీ ముందడుగు పడింది. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా సత్యసాయి జిల్లాలో తన కార్ల తయారీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుత పెనుకొండ ప్లాంట్‌కు అదనంగా ఎర్రమంచిలో ఏడాదికి 2 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో రెండో కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కియా, దాని సరఫరా భాగస్వాములు సంయుక్తంగా 2 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర భారతీయ కరెన్సీలో రూ.18,811 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ విస్తరణ ద్వారా సుమారు 12 వేల మందికి అదనంగా ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ 31వ భాగస్వామ్య సదస్సు వేదికగా రాష్ట్ర ప్రభుత్వంతో కియా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గ్వాంగ్ లీ, కియా కార్పొరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎయి చుల్ జెంగ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
465 ఎకరాల్లో రెండో ప్లాంట్..2030 ప్రారంభంలో ఉత్పత్తి
ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రస్తుత కియా ప్లాంట్ పరిధిలోనే రెండో ప్లాంట్, అనుబంధ యూనిట్లను కలిపి మొత్తం 465 ఎకరాల్లో ఈ విస్తరణ చేపట్టనున్నారు. రెండో ప్లాంట్ లో ఏడాదికి మరో రెండు లక్షల వాహనాలు తయారు చేయాలని లక్ష్యంగా కియా నిర్దేశించుకుంది. 2030 ప్రారంభం నాటికి ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని కియా ప్రణాళిక రూపొందించింది. కొత్త ప్లాంట్‌లో ఐసీఈ, ఈవీ వాహనాలకు సంబంధించిన అధునాతన మోడళ్లను తయారు చేయనున్నారు. వాహన తయారీలో కీలకమైన స్టాంపింగ్, వెల్డింగ్, పెయింటింగ్, అసెంబ్లీ వంటి అన్ని ప్రధాన తయారీ ప్రక్రియలను ఈ ప్లాంట్‌లో చేపట్టనున్నారు. ప్రస్తుతం అనంతపురంలోని కియా ప్లాంట్ ఏడాదికి 4.30 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. రెండో ప్లాంట్ ద్వారా ఏడాదికి 6.30 లక్షల వాహనాల తయారు చేయాలని కియా భావిస్తోంది. రెండు ప్లాంట్ల ద్వారా మొత్తం కియా పెట్టుబడులు దాదాపు 5 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరనున్నాయి. కొత్త ప్లాంట్ విస్తరణతో ఆటోమొబైల్ రంగంలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
పెట్టుబడులకు రక్షణ కల్పిస్తాం
కియా సంస్థతో ఒప్పందం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. కియా సంస్థ రాష్ట్రంలో మరో 2 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ చేపట్టడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకం ఉంచి మరోసారి భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చిన కియా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ కార్లు, ఆటోమొబైల్ విడిభాగాల తయారీలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని కియా ప్రతినిధి బృందాన్ని కోరారు. కియా సంస్థకు డిజైన్ ఇంజనీరింగ్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, స్ట్రాటజిక్ బ్యాటరీ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని సూచించారు. బ్యాటరీ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఐఐటీ తిరుపతి భాగస్వామ్యం వహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. పారిశ్రామిక పెట్టుబడిదారులకు మరింత భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం పెట్టుబడిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఎస్క్రో ఖాతా విధానం ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పెట్టుబడులకు రక్షణ కల్పించేందుకు ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను కూడా తీసుకువస్తున్నట్లు తెలిపారు. విదేశీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తోందని, దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం రాష్ట్రానికి రావడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. దక్షిణ కొరియా కంపెనీలు రాష్ట్రంలో యాంకర్ ఇండస్ట్రీస్ అంబాసిడర్లు గా నిలవాలని ఆకాంక్షించారు. ఏపీలో నైపుణ్యం కలిగిన యువతకు కొదవ లేదని, పరిశ్రమలు వారికి అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర పారిశ్రామిక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. రెండో ప్లాంట్ విస్తరణ పనులను వేగవంతం చేసి 2029 మే నాటికే పూర్తి చేయాలని కియా యాజమాన్యాన్ని కోరారు.
కియా పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం
గతంలో కియా సంస్థను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి విస్తృత ప్రయత్నాలు చేసినట్లు ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అనంతపురం జిల్లాలో కియా ప్లాంట్ ఏర్పాటు చేస్తుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదని, సంస్థ యాజమాన్యాన్ని ఒప్పించేందుకు స్వయంగా దక్షిణ కొరియాకు వెళ్లినట్లు తెలిపారు. ప్లాంట్‌కు అవసరమైన నీటి సౌకర్యం కోసం గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకువచ్చి సహకరించామని, జాతీయ రహదారి, బెంగళూరు విమానాశ్రయానికి అనుసంధాన సదుపాయాలు కల్పించామని చెప్పారు. కేవలం 14 నెలల్లోనే ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యేలా ప్రభుత్వం సహకరించిందని, ఏపీలో తయారైన తొలి కియా కారును తానే ప్రారంభించినట్లు గుర్తుచేశారు. 2019 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కార్ల ఉత్పత్తి ప్రారంభించిన కియా సంస్థ ప్రస్తుతం అనంతపురం జిల్లా పెనుకొండ ప్లాంట్ నుంచి 100కు పైగా దేశాలకు వాహనాలను ఎగుమతి చేస్తోంది. కియా ప్రస్తుత ప్లాంట్‌లో సెల్టోస్, సైరోస్, సోనెట్, కారెన్స్, కారెన్స్ క్లావిస్, కార్నివాల్, సోరెంటో వంటి మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. తాజా విస్తరణతో అధునాతన వాహనాల తయారీ, ఎగుమతులు, అనుబంధ పరిశ్రమల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మరింత కీలక పాత్ర పోషించనుంది.