ఇంటి పన్నులు నూరు శాతం వసూలు చేయాలి :మున్సిపల్ కమీషనర్
ఇంటి పన్నులు 100 శాతం వసూలు చేయాలి :మున్సిపల్ కమీషనర్ పి శ్రీధర్
కనిగిరి ,మేజర్ న్యూస్ :మునిసిపల్ పరిదిలో ఇంటి, నీటి కుళాయి, ఖాళీ స్థలాల పన్నులు నూరుశాతం వసూలు చేయాలని మునిసిపల్ కమీషనర్ పర్వతనేని శ్రీధర్ అన్నారు. గురువారం పురపాలకసంఘము కార్యాలయంలో రెవెన్యూ మరియు టౌన్ ప్లానింగ్ వార్డు సచివాలయ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి కార్యదర్శి తమకు కేటాయించిన పరిధిలో పన్నుల బకాయిలను గుర్తించి, సంబంధిత ఆస్తి యజమానులకు నోటీసులు అందజేసి, ఈ నెలాఖరులోగా పన్నుల వసూళ్ల లక్ష్యాలను సాధించాలని స్పష్టం చేశారు. పట్టణంలోని వ్యాపారులు, దుకాణ యజమానులు రోడ్లు, కాలువలు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. రోడ్లు మరియు డ్రైనేజీలపై ఉన్న అన్ని ఆక్రమణలను ఈ నెలాఖరులోగా స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. నిర్దేశించిన గడువులోగా ఆక్రమణలు తొలగించని పక్షంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రొక్లెయిన్ ద్వారా ఆక్రమణలను తొలగించి, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీధి వ్యాపారులు తోపుడు బండ్లతో మాత్రమే వ్యాపారం చేసుకోవాలని, శాశ్వత కట్టడాలు నిర్మిస్తే వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్, ఆర్.ఐ వెంకటేష్, ఇంచార్జ్ టి.పి.బి.ఓ కృష్ణ, మునిసిపల్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.