సత్తుపల్లికి బదిలీ వద్దే వద్దు..!
సత్తుపల్లికి బదిలీ వద్దే వద్దు..!
-క్లరికల్ సిబ్బంది ఆవేదన
- ఐఎన్‌టీయూసీకి వినతి
కొత్తగూడెం సింగరేణి, సూర్య(మేజర్ న్యూస్)- కొత్తగూడెం ఏరియాలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న క్లరికల్ సిబ్బందిని, జూనియర్ అసిస్టెంట్లు "ఎక్స్‌టర్నల్ బ్యాచ్" ను సత్తుపల్లి ఏరియాకు బదిలీ చేసే ప్రతిపాదనను వెంటనే నిలిపివేయాలని కోరుతూ కొత్తగూడెం ఏరియా క్లరికల్ సిబ్బంది ఐఎన్‌టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్‌కు వినతిపత్రం (మెమోరాండం) అందజేశారు.ఈ సందర్భంగా క్లరికల్ సిబ్బంది మాట్లాడుతూ కొత్తగూడెం ఏరియా విభజన అనంతరం సత్తుపల్లి ఏరియాకు అదనపు విభాగాలను మంజూరు చేసి, అక్కడికి కొత్తగూడెం నుండి అధికారులను మరియు క్లరికల్ సిబ్బందిని కేటాయించాలని ప్రతిపాదించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2022 సెప్టెంబర్ లో జరిగిన క్లరికల్ పరీక్ష ద్వారా తాము నియమితులయ్యామని, ఆ తర్వాత కొత్త క్లరికల్ నియామకాలు జరగకపోవడంతో సంస్థలో తామే జూనియర్ మోస్ట్ క్లరికల్ సిబ్బందిగా కొనసాగుతున్నామని తెలిపారు. దీనివల్ల ఏదైనా డిప్యుటేషన్లు, బదిలీలు లేదా సిబ్బంది సర్దుబాటు జరిగినప్పుడల్లా జూనియర్లమనే కారణంతో తమనే పదేపదే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొత్తగూడెం ఏరియాలో క్లరికల్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని వారు పేర్కొన్నారు.వారి ప్రధాన డిమాండ్లను వివరించారు.గత రెండున్నర సంవత్సరాలుగా నిలిచిపోయిన పెండింగ్ క్లరికల్ నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయించాలి.ఈనెల 17 నిర్వహించనున్న కౌన్సిలింగ్ ద్వారా జనరల్ అసిస్టెంట్లను (యూజీ ) జనరల్ అసిస్టెంట్లు (సర్ఫేస్ ) గా డిజిగ్నేషన్ మార్పు చేసి వారి సర్దుబాటును పరిశీలించాలి.తదుపరి క్లరికల్ నియామకాలు పూర్తయ్యే వరకు సత్తుపల్లి ఏరియాలో ప్రస్తుతం పనిచేస్తున్న క్లరికల్ సిబ్బంది మరియు జనరల్ అసిస్టెంట్ల సేవలనే అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని కోరారు. క్లరికల్ సిబ్బంది సమస్యలను సావధానంగా విన్న ఎండి రజాక్ సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యలను కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ మరియు సంబంధిత ఉన్నత అధికారులతో చర్చించి, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ డాక్టర్ బి. జనక్ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్తానని, ప్రస్తుత క్లరికల్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, బదిలీల విషయంలో న్యాయమైన పరిష్కారం లభించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జూనియర్ అసిస్టెంట్లు, జీఎం ఆఫీస్ క్లరికల్ సిబ్బంది పాల్గొన్నారు.