telangana
అనుమతులు లేకుండా అధిక ధరలకు మద్యం విక్రయం.భార్యాభర్తల అరెస్టు.. 150 మద్యం సీసాలు స్వాధీనం
రాయదుర్గం,మేజర్ న్యూస్ : గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) కంటే అధిక ధరలకు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో ఇంటి నంబరు 131/31లో అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి కె. గణేష్ (34), అతని భార్య కె. రుక్కమ్మ (27)ను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి వివిధ బ్రాండ్లకు చెందిన 150 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 650 మి.లీ. పరిమాణం గల 19 బీరు సీసాలు, 180 మి.లీ. పరిమాణం గల 131 విస్కీ, రమ్, వోడ్కా సీసాలు ఉన్నాయి. మొత్తం 35.93 లీటర్ల మద్యం విలువ సుమారు రూ.35 వేలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.నిందితులు, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై ఎస్‌హెచ్‌ఓ టి. భూపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.