ఆర్మూర్ "బల్దియా"లో అక్రమ నిర్మాణాల జోరు...అదుపుచేయ"లేక"పోతున్న అధికారులు.
సూర్య ఆర్మూర్ ప్రతినిధి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి, పెర్కిట్ గ్రామాలతో పాటు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ప్రజా ప్రతినిధులకు, అధికారులకు చేతులు తడిపితే చాలు అనుమతి లేని ఎలాంటి నిర్మాణాలైనా చేసుకోవచ్చనే సంకేతాలు చెప్పకనే చెబుతున్నాయని అంటున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు ఆయా వార్డులలోని ప్రజా ప్రతినిధులకు సమాచారం లేకుండా ఎలాంటి నిర్మాణాలు జరుగవనే విషయం జగమెరిగిన సత్యం. అంటే అధికారుల అజమాయిషి ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. కానీ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించే తీరు వెనుక అసలు మతలబుందని పేర్కొంటున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఎవరైనా ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన తప్పనిసరిగా అనుమతి (పర్మిషన్) తీసుకోవాల్సిందే. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు రెండు అంతస్తుల నిర్మాణాలకు మాత్రమే అధికారులకు అధికారం ఉందని తెలిసింది. మూడు, నాలుగు, ఐదు అంతస్తులు నిర్మించాలంటే హైదరాబాద్ లెవెల్లో టౌన్ ప్లానింగ్ నుండి అనుమతి తీసుకోవాల్సిందే. కాగా కొందరు ఎలాంటి అనుమతులు పొందకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే మామిడిపల్లి గ్రామంలోని 24 వార్డ్ లో ఇంటి నెంబర్(11-105) కొత్తపల్లి రాజేశ్వర్ అనే వ్యక్తి 63 వ నెంబరు జాతీయ రహదారి అనుకొని కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాడు. గ్రౌండ్ ఫ్లోర్ కు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకున్నారడు. అనంతరం మామిడిపల్లి గ్రామం స్థాయి పెరిగి మున్సిపల్ పరిధిలోకి రాగా మరో మూడంతస్తుల నిర్మాణం చేపట్టాడు. దీనికి మున్సిపల్ అధికారుల నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అయినప్పటికీ నిర్మాణం పూర్తి చేశాడు. అలాగే మామిడిపల్లి 24 వ వార్డు ఇంటి నెంబర్14-54/1 జలంధర్ తండ్రి పేరు సంజీవ్ అనే వ్యక్తి రోడ్డును ఆనుకొని గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఒక అంతస్తు నిర్మాణం చేపట్టాడు. మున్సిపల్ నుండి ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం జరగడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాహటంగా రోడ్డుపైనే నిర్మాణం చేపట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చా అని చర్చించుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల తీరుపై అసహనం వ్యక్తం వ్యక్తమౌతోంది. ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎన్నో జరుగుతున్న సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు చలనం లేకుండా వ్యవహరించడం వారి విజ్ఞతకే చెల్లుతుందని పేర్కొంటున్నారు.
* నోటీసులు ఎందుకు ఇస్తరు..? అనుమతి లేకుండా గృహ నిర్మాణాలు, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగిన వాటికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. అనుమతి లేకుండా నిర్మించడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారికి నోటీసులు అందజేస్తారు. నోటీసులలో పేర్కొన్నట్లుగా సమాచారం ఇవ్వని పక్షంలో చర్యలు తీసుకునే అధికారం మున్సిపల్ అధికారులకు ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అమలుకు సంబంధించిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఫిర్యాదు చేస్తే తప్ప స్పందించని అధికారులు లేకపోలేరు.
* కొత్త ఉపాయానికి తెర..?
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అధికారులు కొత్త విధానానికి తెరలేపారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం తెలిసినప్పటికీ కాలయాపన చేసి నిర్మాణం పూర్తయిన తర్వాత నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంటి నిర్మాణం చేపట్టే యజమానులు దరఖాస్తు చేసుకున్నప్పటి నుండి ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నారనే విషయం అటు అధికారులకు, ఇటు ప్రజాప్రతినిధులకు తెలిసే ఉంటుంది. అయినప్పటికీ అనుమతి లేని నిర్మాణాదారులకు సహకరించడం కోసం ఇలాంటి కొత్త తరహా ఉపాయానికి ప్రయత్నాలు చేస్తున్నారని బాహాటంగానే చర్చించుకుంటున్నారు. అధికారుల తీరుపై పట్టణ ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏదిఏమైనప్పటికీ ఉన్నతా స్థాయి అధికారులు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో దృష్టి సారించి అనుమతి లేని నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.