తిరుమలలో భక్తుల రద్దీ: సర్వదర్శనానికి 15 గంటల సమయం
తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోవడంతో, క్యూ లైను వెలుపలికి వచ్చి కృష్ణతేజ సర్కిల్ వరకు వేచి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.
ఇక నిన్న ఒక్కరోజే మొత్తం 78,085 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 26,232 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.93 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. భక్తులకు క్యూ లైన్లలో తాగునీరు, అల్పాహారం నిరంతరాయంగా అందించేలా ఏర్పాట్లు చేశారు.