BREAKING
ఆర్మూర్ "బల్దియా"లో అక్రమ నిర్మాణాల జోరు...అదుపుచేయ"లేక"పోతున్న అధికారులు. 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ: పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఆగని అక్రమ నిర్మాణాలు.నోటీసులకే పరిమితమైన పంచాయతీ. మండల కేంద్రంలో ఆగని అక్రమ నిర్మాణాలు. తిరుమలలో భక్తుల రద్దీ: సర్వదర్శనానికి 15 గంటల సమయం అభివృద్ధి ,సంక్షేమ పథకాలే కూటమిని గెలిపించాయి అసోంలో తప్పిన పెను ప్రమాదం: పట్టాలు తప్పిన సైరాంగ్ ఎక్స్‌ప్రెస్, ఏడుగురికి గాయాలు నేడు విశాఖకు సీఎం చంద్రబాబు భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన దాంపత్య వ్రత మహోత్సవం పిల్స్‌బరీ డౌబోయ్ వాయిస్ ఆర్టిస్ట్ జోబీ సెర్నీ కన్నుమూత: చాకలి ఐలమ్మ విగ్రహానికి లక్ష రూపాయలు విరాళం అందజేత 'వారు కూడా మనుషులేనని గుర్తుంచుకోవాలి': పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల ప్రకటనపై రేణు దేశాయ్ స్పందన సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' ట్రైలర్‌పై మిశ్రమ స్పందనలు వ్యాపార విస్తరణ-దౌత్య యుద్ధాలు 96 ఏళ్ల వయసులో రణ్‌వీర్ సింగ్ తాతయ్య కన్నుమూత

వ్యాపార విస్తరణ-దౌత్య యుద్ధాలు

Select Suryaa Now
వ్యాపార విస్తరణ-దౌత్య యుద్ధాలు

అంతర్జాతీయ కార్పొరేట్ రంగంలో మహామహులుగా వెలుగుతున్న వ్యాపారవేత్తల వ్యక్తిగత వివాదాలు, రక్షణ సంబంధిత హనీట్రాప్ వ్యవహారాలు కేవలం ఒక వ్యక్తిగత తప్పిదంగా మిగిలిపోవడం లేదు. వీటి వెనుక అంతర్జాతీయ గూఢచర్యం, దౌత్య వ్యూహాలు, డేటా చోరీ వంటి పెద్ద ఎత్తున వ్యాపార విస్తరణ కుట్రలు దాగి ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భద్రతా నిపుణుల దృష్ట్యా ఇది కేవలం వినోదాత్మక వార్త కాదు, దేశ భద్రత, సున్నితమైన సమాచార రక్షణకు పొంచి ఉన్న పెద్ద ముప్పు.
కృత్రిమ మేధ చిప్‌ల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఇటీవల తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు. ఆయన సింగపూర్‌కు చెందిన ఒక వ్యాపార కార్యనిర్వాహకురాలితో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వ్యవహారం వెనుక చైనా గూఢచర్య ఏజెన్సీ ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా సంబంధాలు కేవలం వ్యక్తిగత బలహీనతలు కావు, ఆధునిక ప్రపంచంలో గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలను లొంగదీసుకోవడానికి, వాటి ఏఐ డిజైన్లు, వ్యాపార విస్తరణ వ్యూహాలు, సాంకేతిక రహస్యాలు దొంగిలించడానికి అంతర్జాతీయ ఏజెన్సీలు వేస్తున్న వ్యూహాత్మక వలలు ఇవి. కార్పొరేట్ రంగాన్ని తమ అదుపులోకి తెచ్చుకోవడానికి ఇటువంటి హనీట్రాప్‌లను ఒక వ్యాపార విస్తరణ ఆయుధంగా ఉపయోగిస్తున్నారు.
గతంలో వెలుగులోకి వచ్చిన జెఫ్రీ ఎప్‌స్టీన్ కేస్ వంటి అంతర్జాతీయ వివాదాలు ఈ అంశాన్ని స్పష్టంగా నిరూపించాయి. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ వ్యాపారవేత్తలు, నాయకులు, రాజకీయ దిగ్గజాలు ఇటువంటి వివాదాల్లో చిక్కుకోవడం ద్వారా వారి నిర్ణయాలను, కంపెనీల భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో బ్లాక్‌మెయిలింగ్‌కు గురవుతున్నారు. వ్యాపారాల విస్తరణ, రక్షణ రంగ కాంట్రాక్టుల కేటాయింపు, కీలకమైన ఆర్ధిక విధానాల మార్పుల వెనుక ఇటువంటి అంతర్జాతీయ డర్టీ పాలిటిక్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని స్పష్టమవుతోంది.
భారతదేశంలో కూడా ఇటువంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. విశాఖపట్నంలో ఈస్టర్న్ నావల్ కమాండ్‌ను లక్ష్యంగా చేసుకుని సాగిన హనీట్రాప్ కేసు దేశ భద్రతా దళాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. పాకిస్థాన్ గూఢచర్య సంస్థలు సోషల్ మీడియా వేదికగా దొంగ ప్రొఫైళ్లతో భారత నావికాదళ సిబ్బందిని బురిడీ కొట్టించి, కీలకమైన నావికాదళ ఆస్తులు, సబ్ మెరైన్ వివరాలు, తీరప్రాంత భద్రతా సమాచారాన్ని సేకరించాయి. ఇది కేవలం మిలిటరీకే పరిమితం కాకుండా డిఆర్‌డిఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ కేసు, బ్రహ్మోస్ క్షిపణి ఇంజనీర్ నిషాంత్ అగర్వాల్ కేసుల వరకు విస్తరించింది.
భారతదేశం ప్రస్తుతం డిజిటల్ విప్లవంలో దూసుకుపోతోంది. 140 కోట్లకు పైగా ఉన్న భారత ప్రజల పర్సనల్ డేటా, ఆధార్ వివరాలు, యూపిఐ లావాదేవీల డేటా, రక్షణ రంగ డేటా అంతర్జాతీయ టెక్ దిగ్గజాల సర్వర్లలో నమోదవుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు లేదా ఉన్నతాధికారులు ఇటువంటి హనీట్రాప్ గూఢచర్యం వలలో చిక్కితే, భారతీయులకు చెందిన కీలకమైన సున్నితమైన డేటా విదేశీ శత్రు ఏజెన్సీల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉనికిలోకి వస్తుంది. భారతీయ రక్షణ దళాల సిబ్బంది, కీలకమైన సాంకేతిక పదవుల్లో ఉన్న అధికారులు సోషల్ మీడియా సంభాషణలు, అపరిచిత వ్యక్తుల పరిచయాల విషయంలో కఠినమైన భద్రతా నిబంధనలను పాటించాలి. విదేశీ టెక్నాలజీ, మైక్రోచిప్‌లపై ఆధారపడటం తగ్గించి, స్వదేశీ ఏఐ, సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేసుకోవడం భారత్‌కు ఎంతో ఆవశ్యకం. 
కార్పొరేట్ రంగంలో సాగే ఈ హనీట్రాప్‌లు, గూఢచర్యం కేవలం వ్యాపార రహస్యాల దొంగతనంతోనే ఆగిపోవు. అంతర్జాతీయంగా ఒకే రంగానికి చెందిన పోటీ కంపెనీలను దెబ్బతీయడానికి, వాటి మార్కెట్ షేరును పడగొట్టడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇటువంటి వ్యూహాలను అమలు చేస్తారు. ఒక ప్రధాన టెక్నాలజీ సంస్థ హెడ్ లేదా సీఈఓ ఇటువంటి వివాదంలో చిక్కుకున్నప్పుడు, ఆ కంపెనీ బోర్డు మేనేజ్‌మెంట్ ఒత్తిడికి లోనవుతుంది. ఫలితంగా వారు తీసుకోబోయే వాణిజ్య నిర్ణయాలు, పెట్టుబడుల కేటాయింపులు, కొత్త దేశాలలో వ్యాపార విస్తరణ ప్రణాళికలు దెబ్బతింటాయి. ఇదంతా శత్రు దేశాల లేదా పోటీదారుల ఆర్థిక ప్రయోజనాల కోసమే జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరొక ప్రధానమైన ప్రమాదం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులపై వీటి ప్రభావం పడటం. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ చిప్‌లు, క్లౌడ్ డేటా సెంటర్లు కొన్ని పరిమిత గ్లోబల్ కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. అటువంటి సంస్థల అగ్ర నాయకత్వం బ్లాక్‌మెయిలింగ్‌కు గురైనప్పుడు, ఆ ప్రభావం నేరుగా ఆయా కంపెనీలపై ఆధారపడిన భారతదేశం వంటి వర్ధమాన దేశాల డిజిటల్ మౌలిక సదుపాయాలపై పడుతుంది. 
ఈ నేపథ్యంలో భారతదేశం కేవలం విదేశీ డిజిటల్ భద్రతా ప్రమాణాలపై ఆధారపడకుండా, తన సొంత డేటా సార్వభౌమాధికారాన్ని బలోపేతం చేసుకోవడం తక్షణ అవసరం. సైబర్ సెక్యూరిటీ నిబంధనలను మరింత కఠినతరం చేయడం, విదేశీ కంపెనీలు భారతీయుల డేటాను తమ దేశీయ సర్వర్లలోనే భద్రపరిచేలా చట్టాలను అమలు చేయడం వంటి చర్యలు వేగవంతం చేయాలి. అలాగే రక్షణ రంగం, ఐటీ, శాస్త్ర సాంకేతిక విభాగాల్లో పనిచేసే ఉన్నతాధికారులకు డిజిటల్ హనీట్రాప్ ప్రమాదాలపై నిరంతరం అవగాహన కల్పిస్తూ, సైబర్ దాడులు, గూఢచర్యం నుంచి దేశ భద్రతను కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మనపై ఉంది.