జర్నలిస్టుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మీ ప్రసాదన్న మీ కోసమే ఉన్నాడు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:
జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వానికి ముఖ్యమని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) వికారాబాద్ జిల్లా తృతీయ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టులు ఎండనకా, వాననకా, రాత్రింబవళ్లు ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారని కొనియాడారు. జర్నలిస్టుల కష్టాలు, ఇబ్బందులు తనకు తెలుసని, వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందన్నారు. జర్నలిస్టులకు వ్యక్తిగతంగా, ఆరోగ్యపరంగా లేదా వృత్తిపరంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని, హైదరాబాద్‌లోని ప్రజాభవన్, మినిస్టర్ క్వార్టర్స్‌లో తన సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. 'మీకు ఏ సమస్య వచ్చినా చెప్పండి.. మీ ప్రసాదన్న మీ కోసమే ఉన్నాడు' అంటూ జర్నలిస్టులకు భరోసా కల్పించారు.20 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్టులు మహాసభకు హాజరు కావడం అభినందనీయమని, వారి అనుభవం సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. జర్నలిస్టుల కలం బలం ప్రజాస్వామ్యానికి బలమని, మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమని అన్నారు. నేటి డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) కారణంగా నిజమైన వార్తలకు, నకిలీ వార్తలకు మధ్య తేడా గుర్తించడం కష్టమవుతోందని, తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టులపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. వాస్తవాలను నిర్ధారించుకుని నిజమైన సమాచారాన్ని మాత్రమే ప్రజలకు చేరవేయాలని సూచించారు.రాష్ట్రంలో గత మూడేళ్లుగా ప్రజా ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఇటీవల ముఖ్యమంత్రి రూ.9,500 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కోరారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే చేస్తున్న నిరంతర పోరాటం అభినందనీయమని, సంఘం ఐక్యత, పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమని ప్రశంసించారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ మహాసభకు తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే (ఐ జే యు) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విరహత్ అలీ, రామ్ నారాయణ, కోశాధికారి వెంకట్ రెడ్డి, ఐజేయు జాతీయ ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసచారి , కొత్తపల్లి శ్రీధర్, జిల్లా కోశాధికారి, అక్రెడిషన్ కమిటీ సభ్యులు కుమ్మరి రాఘవేందర్,తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రంగరాజు, వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ వి.సత్యనారాయణ, జిల్లాలోని జర్నలిస్టులు తదితరులు హాజరయ్యారు.