17ఏళ్ల దేశసేవకు ఘన సత్కారం
నవాబుపేట సూర్య న్యూస్: దేశ రక్షణ కోసం 17ఏళ్ల పాటు భారత సైన్యంలో విశేష సేవలందించి పదవీ విరమణ పొందిన కారుకొండ గ్రామానికి చెందిన సైనికుడు పోలీస్ రాజుకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్న ఆయనను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సంతోషి భూపాల్ రెడ్డి,పాలకవర్గ సభ్యులు,గ్రామ నాయకులు రాజుకు పూలమాలలు వేసి సాదరంగా ఆహ్వానించారు.దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని,కుటుంబానికి దూరంగా ఉంటూ దేశ రక్షణకు అంకితభావంతో సేవలందించిన ఆయన త్యాగాలను,క్రమశిక్షణను,దేశభక్తిని కొనియాడారు.అనంతరం రాజు తన 17ఏళ్ల సైనిక జీవితంలో ఎదురైన అనుభవాలు,సవాళ్లు,దేశ సేవలో గడిపిన మధుర జ్ఞాపకాలను గ్రామస్థులతో పంచుకున్నారు.దేశ సేవలో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో గర్వకారణమని భావోద్వేగంగా తెలిపారు.సన్మాన కార్యక్రమం అనంతరం గ్రామ పంచాయతీ నుంచి ఆయన నివాసం వరకు ప్రత్యేక వాహనంలో ఊరేగింపు నిర్వహించారు.డప్పు వాయిద్యాలు,బాజా భజంత్రీలు,బాణసంచా వెలుగుల నడుమ గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని పండుగ వాతావరణంలో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ హరలింగం,పోలీస్ విక్రమ్,ప్రసాద్ గౌడ్,ఇతర గ్రామ నాయకులు,రాజు కుటుంబ సభ్యులు,గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.