యువతిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం
- రూటు మార్చి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు యువతి ఫిర్యాదు
- ప్రతిఘటించి తప్పించుకున్న యువతి.. - - రూ.60 వేల నగదు బ్యాగ్ తీసుకుని డ్రైవర్ పరారీ
గచ్చిబౌలికి చెందిన ఓ యువతిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించినట్లు ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. క్యాబ్లో గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా రూటు మార్చి కొత్వాల్‌గూడ వైపు నిర్మానుష్య ప్రాంతాల్లోకి తీసుకెళ్లినట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన అనంతరం డ్రైవర్ తనపై లైంగిక దాడికి యత్నించినట్లు యువతి ఆరోపించింది. దీంతో ఆమె ప్రతిఘటించి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న బ్యాగ్‌ను క్యాబ్ డ్రైవర్ తీసుకుని పరారైనట్లు తెలిపింది. ఆ బ్యాగ్‌లో సుమారు రూ.60 వేల నగదు ఉన్నట్లు యువతి పోలీసులకు వివరించినట్లు సమాచారం.
యువతి ఫిర్యాదు మేరకు ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్యాబ్ డ్రైవర్ ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. క్యాబ్ వివరాలు, ప్రయాణ మార్గం, సీసీటీవీ ఫుటేజీ తదితర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
- పి నరసింహ : మేజర్ న్యూస్, శంషాబాద్.