హైదరాబాద్ లో 'బిల్ట్రస్ట్' గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ * రూ.450 కోట్ల పెట్టుబడి... కొత్తగా వేయి మందికి ఉద్యోగాలు * 2,600 మంది బీ2బీ సరఫరాదారులు, 14 మిలియన్ల కొనుగోలుదారులకు సేవలు * లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణ బ్యూరో ప్రతినిధి : జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌ను తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ బిజినెస్ టూ బిజినెస్ (బీ2బీ) క్యాష్ జనరేషన్ ప్లాట్‌ఫాం 'బిల్ట్రస్ట్' కూడా చేరింది. మాదాపూర్ రహేజా మైండ్ స్పేస్ లో 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.450 కోట్ల పెట్టుబడి అంచనా వ్యయంతో అభివృద్ధి చేసిన 'బిల్ట్రస్ట్ టెక్నాలజీ సెంటర్'ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆనతికాలంలోనే హైదరాబాద్ జీసీసీలకు హబ్ గా మారిందన్నారు. గతేడాది 75 కు పైగా కొత్త జేసీసీలు ఇక్కడ ప్రారంభమయ్యాయని... ఇది దేశంలోనే అత్యధికమని వివరించారు. ఈ ఏడాది 100 జీసీసీలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జీసీసీలను కేవలం బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్లకు మాత్రమే పరిమితం చేయకుండా... గ్లోబల్ వాల్యూ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో ఏఐ-ఫస్ట్ జీసీసీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన 'బిల్ట్రస్ట్'కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ 2,600 మంది బీ2బీ సరఫరాదారులు, 14 మిలియన్లకు పైగా కొనుగోలుదారులకు సేవలు అందిస్తోందన్నారు. ఈ సంస్థ గ్లోబల్ ఆపరేషన్స్, టెక్నాలజీ, ఆర్అండ్ డీ విభాగాల అనుసంధానంలో ఈ టెక్నాలజీ సెంటర్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఇక్కడ దశలవారీగా కొత్తగా వేయి మంది హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. హైదరాబాద్ లో టెక్ ట్యాలెంట్ కు కొదవ లేదని, వారిని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చి దిద్దేందుకు రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, టాస్క్, టీ హబ్ తదితర సంస్థలతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని బిల్ట్రస్ట్ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. కార్యక్రమంలో బిల్ట్రస్ట్ సీఈఓ గ్రాంట్ హల్లరాన్, ఇండియా జీసీసీ కంట్రీ హెడ్ ఫర్హాద్ హెచ్. బారియా తదితరులు పాల్గొన్నారు.