తహశీల్దార్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు
మునగాల, మేజర్ న్యూస్: మునగాల మండలం కలకోవ గ్రామ పరిధిలోని ముస్లిం మైనార్టీకి చెందిన ఖబరస్తాన్ స్థలం ఆక్రమణకు గురవుతోందని, సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా 5 నెలలు గడిచినా పరిష్కారం చూపలేదని ఆరోపిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుదారు కలకోవ గ్రామ అభివృద్ధి కమిటీ మాజీ సభ్యుడు మండవ చంద్రయ్య తన ఫిర్యాదులో 25-05-2026న ప్రజావాణి గ్రీవెన్స్ ఐడీ నెం. DSRPT25052600003 ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఖబరస్తాన్ స్థలాన్ని సర్వే చేసి హద్దులను నిర్ధారించి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని కోరినా మునగాల తహశీల్దార్ కార్యాలయం నుంచి ఎలాంటి పరిష్కారం లభించలేదని, కనీసం పురోగతిపై సమాచారం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాల్సి ఉండగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత రెవెన్యూ అధికారుల తీరుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కలకోవ ఖబరస్తాన్ స్థలంపై తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించి హద్దురాళ్లు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఆక్రమణలకు ఆస్కారం లేకుండా చూడాలని కలెక్టర్‌ను కోరారు.