వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం, భర్తతో గొడవపడి ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
పూడూరు,మేజర్ న్యూస్ (అక్టోబర్ 03): వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సోమన్ గూర్తి గ్రామ శివారులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో ఒక తల్లి తీసుకున్న నిర్ణయం ముగ్గురి ప్రాణాలను బలిగొన్నది. భర్తతో జరిగిన గొడవ కారణంగా మనస్తాపానికి గురైన వివాహిత, తన ఇద్దరు చిన్నారులతో సహా వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించగా, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబంలో నెలకొన్న విషాద ఛాయలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, వికారాబాద్ జిల్లా మాటుగూడెం గ్రామానికి చెందిన రాజు, మమత దంపతుల మధ్య కుటుంబ విషయాలై శుక్రవారం ఉదయం తీవ్ర వాగ్వాదం జరిగింది. భర్తతో గొడవపడిన మమత, తీవ్ర మనస్తాపంతో తన ఇద్దరు పిల్లలైన సాకేత్ (8), జనశ్రీ (4)లను వెంటబెట్టుకుని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఆందోళన చెంది చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. చివరకు రాత్రి సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు అదృశ్యంపై ఫిర్యాదు కూడా చేశారు.పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించగా, సోమన్ గూర్తి గ్రామ శివారులోని ఒక వ్యవసాయ పొలం వద్ద ఉన్న బావి దగ్గర మమతకు సంబంధించిన చెప్పులు, బ్యాగు కనిపించడంతో అనుమానాలు బలపడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, స్థానికుల సహాయంతో బావిలో గాలింపు చర్యలు చేపట్టగా తల్లి మమత, కూతురు జనశ్రీ మృతదేహాలు వెలికితీశారు. మరో కుమారుడు సాకేత్ కోసం బావిలో గజఈతగాళ్ల సహాయంతో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి మనస్పర్థలు నిండు ప్రాణాలను బలిగొనడంతో మాటుగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రిపోర్టర్ శ్రీరాములు.