పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి
డిగ్రీ పూర్తిచేసిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
తెలంగాణ ఉద్యమకారుల గ్రాడ్యుయేట్ ఫోరం వికారాబాద్ నాయకులు కుమ్మరి శ్రీనివాస్
వికారాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 4): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో భాగస్వామి కావాలని తెలంగాణ ఉద్యమకారుల గ్రాడ్యుయేట్ ఫోరం వికారాబాద్ నాయకులు కుమ్మరి శ్రీనివాస్ కోరారు.హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ పూర్తిచేసిన యువత, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఓటు కేవలం హక్కు మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే బాధ్యత కూడా అని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు, ఆకాంక్షలు, అభిప్రాయాలను శాసనమండలిలో ప్రతిబింబించే ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం ఓటు ద్వారా లభిస్తుందని తెలిపారు.
ఓటరు నమోదుకు అవసరమైన ఫారం–18, డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, డిగ్రీ మార్కుల మెమో, ఓటర్ ఐడీ (EPIC), ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. నమోదు అనంతరం ఓటరు జాబితాలో తమ పేరు నమోదైందో లేదో కూడా ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని కోరారు.
యువ గ్రాడ్యుయేట్లు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముందుకు వచ్చి తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడంతో పాటు ఇతర పట్టభద్రులకు కూడా అవగాహన కల్పించాలని కుమ్మరి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.