నోటి ఆరోగ్యానికి నాలుక శుభ్రత ఎంత ముఖ్యం? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?
సూర్య లైఫ్‌స్టైల్ డెస్క్: ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేసుకోవడం మన దైనందిన జీవితంలో భాగం. అయితే చాలా మంది కేవలం దంతాలను మాత్రమే శుభ్రం చేసుకుని వదిలేస్తుంటారు కానీ నాలుకను శుభ్రం చేసుకోవడం పట్ల సరైన శ్రద్ధ పెట్టరు. నిజానికి నోటి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉండాలంటే కేవలం పళ్ళను తోముకోవడం మాత్రమే సరిపోదు, ప్రతిరోజూ నాలుకను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం అత్యంత కీలకమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నాలుకను సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మనం తీసుకునే ఆహార పదార్ధాల తాలూకు అవశేషాలు, బ్యాక్టీరియా మరియు మృత కణాలు నాలుకపై పేరుకుపోవడం వల్ల నోటి నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. ఎంతో మందికి పళ్ళు ఎంత తెల్లగా ఉన్నప్పటికీ నోటి దుర్వాసన సమస్య వేధిస్తుంటుంది, దానికి ప్రధాన కారణం నాలుకపై పెరిగే హానికరమైన బ్యాక్టీరియానే. ఈ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల రుచి మొగ్మలు దెబ్బతిని మనం తింటున్న ఆహార పదార్థాల రుచిని సరిగ్గా ఆస్వాదించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే దంతాలతో పాటు నాలుకను కూడా శుభ్రం చేసే అలవాటును దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నాలుకను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా శాతం గణనీయంగా తగ్గిపోయి చిగుళ్ల వ్యాధులు, దంత క్షయం వంటి అనారోగ్య సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. కేవలం నోటి ఆరోగ్యం మాత్రమే కాకుండా శరీరంలోని రోగ నిరోధక శక్తి మెరుగుపడటానికి కూడా ఇది పరోక్షంగా సహాయపడుతుంది. మార్కెట్లో లభించే టంగ్ క్లీనర్లను ఉపయోగించి సున్నితంగా నాలుకను శుభ్రం చేసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగవుతుందని ఆయుర్వేద నిపుణులు కూడా ధృవీకరిస్తున్నారు. కాబట్టి ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం బ్రష్ చేసుకునే సమయంలో నాలుకను కూడా శుభ్రం చేసుకునే ఆరోగ్యకరమైన అలవాటును ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి.