జపనీయుల మహిళ హత్య కేసులో అమెరికా మెరైన్ అరెస్ట్
సూర్య అంతర్జాతీయ డెస్క్: జపాన్‌లోని దక్షిణ ద్వీప ప్రాంతమైన ఒకినావాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక జపనీస్ మహిళను దోచుకుని అత్యంత క్రూరంగా హత్య చేసిన ఆరోపణలపై ఒక అమెరికన్ సైనికుడిని జపాన్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అమెరికా మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్ ఫుటెన్మాలో పనిచేస్తున్న ఇరవై ఏళ్ల డెవిన్ జాకబ్ బల్లార్డ్ అనే సైనికుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఒకినావా ప్రిఫెక్చరల్ పోలీసులు అధికారికంగా వెల్లడించారు. ఈ అకృత్యం స్థానికంగా కలకలం రేపడంతో పాటు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలకు దారితీసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒకినావా రాజధాని నహాలోని ఒక హోటల్‌లో ముప్పై తొమ్మిదేళ్ల అన్నా యాగీ అనే జపనీస్ మహిళ హత్యకు గురయ్యారు. శనివారం తెల్లవారుజామున ఆమెను హత్య చేసి, వాలెట్ మరియు బ్యాగ్‌ను దోచుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంఘటన స్థలం సమీపంలోని సీసీటీవీ పుటేజ్ ఆధారంగా ఒక విదేశీ వ్యక్తి ఆ మహిళతో కలిసి గదిలోకి వెళ్లడం, ఆ తర్వాత ఆమె వస్తువులతో బయటకు వస్తున్నట్లు గుర్తించారు. దీని ఆధారంగా అనుమానితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, తనపై వస్తున్న ఆరోపణలను సదరు మెరైన్ సైనికుడు ఖండించినట్లు సమాచారం.
ఈ ఘటనపై జపాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అమెరికా అధికారులకు బలమైన నిరసన (స్ట్రాంగ్ ప్రొటెస్ట్) తెలియజేసినట్లు జపాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మరోవైపు జపాన్‌లోని అమెరికా రాయబారి స్పందిస్తూ, బాధితురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. జపాన్‌లో సుమారు 54 వేల మంది అమెరికన్ సైనిక సిబ్బంది మోహరించి ఉండగా, తరచూ సైనికుల వల్ల స్థానికంగా జరుగుతున్న నేరాలు ఒకినావా ప్రజలలో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమవుతున్నాయి. ఈ తాజా హత్య ఉదంతం ఇరు దేశాల మధ్య భద్రతా ఒప్పందాల వైఖరిపై మరోసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.