పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం
సైనికుడి పార్థివ దేహంతో వెళ్తున్న అంబులెన్స్ ట్రక్కును ఢీకొని నలుగురి దుర్మరణం
సూర్య జాతీయ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక సైనికుడి పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్ ట్రక్కును ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ఉదయం సుమారు 8:30 గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఆర్మీ సుబేదార్ సత్యవాన్ ఫౌజీ పార్థివ దేహాన్ని లక్నో నుంచి ఘాజీపూర్‌కు తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో మరణించినవారు అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్నవారే. మృతులను అంబులెన్స్ డ్రైవర్ జస్పాల్, రాజన్ సింగ్, గౌరవ్ సింగ్, రామ్ సమ్‌ఝ్‌గా గుర్తించారు. ప్రమాద తీవ్రతకు అంబులెన్స్ నుజ్జునుజ్జు కాగా, పోలీసులు, ఎక్స్‌ప్రెస్‌వే సిబ్బంది తీవ్రంగా శ్రమించి లోపల చిక్కుకున్నవారిని బయటకు తీశారు. ఘటనపై మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, మృతుల కుటుంబాలతో సంప్రదించి సాధ్యమైన అన్ని రకాల సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల యూపీలోని ఎక్స్‌ప్రెస్‌వేలపై వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజుల క్రితమే గోరఖ్‌పూర్ లింక్ ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు, ట్రక్కు ఢీకొనడంతో నలుగురు చనిపోయారు. సైనికుడి అంతిమ యాత్రలో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడంతో ఆయన కుటుంబంలో, స్వస్థలంలో శోకసంద్రం నెలకొంది.